July 19, 2026

Dancers Association Rift: ‘ఉప ఎన్నికల’కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు.. ‘పూర్తి ఎన్నికలు’ కావాలంటున్న అసమ్మతి వర్గం!

Dancers Association Rift: ‘ఉప ఎన్నికల’కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు.. ‘పూర్తి ఎన్నికలు’ కావాలంటున్న అసమ్మతి వర్గం!
Reading Time: 2 minutes
Tftdda Dancers Association By Elections Schedule Controversy

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) తీవ్ర అంతర్గత విభేదాలతో వేడెక్కింది. నిన్న ఫెడరేషన్తో సుదీర్ఘమైన సమావేశం అనంతరం ఈరోజు అసోసియేషన్‌లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రస్తుత అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవి అధికారికంగా ప్రకటించడమే ఈ రచ్చకు కారణమైంది. ఈ నిర్ణయాన్ని రాజీనామా చేసిన సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసోసియేషన్‌లో నెలకొన్న వివాదాలకు ప్రజాస్వామ్య పద్ధతిలో ముగింపు పలకాలని అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవి నిర్ణయించారు. అసోసియేషన్ రాజ్యాంగం, నిబంధనలు, చట్టాలకు అనుగుణంగానే ఈ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించినట్లు ఆమె స్పష్టం చేశారు. జాయింట్ లేబర్ కమిషనర్ తో జరిగిన చర్చల అనంతరం, 2025-2027 కాలానికి గానూ మిగిలిన పదవుల భర్తీ కోసం ఈ పార్షియల్ మోడిఫికేషన్ (ఉప ఎన్నికల) షెడ్యూల్‌ను ఎన్నికల అధికారి విడుదల చేశారు.

ఎన్నికల షెడ్యూల్ వివరాలు:
జూలై 20 (ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు): నామినేషన్ల స్వీకరణ
జూలై 20 (మధ్యాహ్నం 3:00 గంటలకు): నామినేషన్ల పరిశీలన, ఫైనల్ లిస్ట్ విడుదల
జూలై 22 (ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు): నామినేషన్ల ఉపసంహరణ
జూలై 22 (మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 5:00 వరకు): గుర్తుల కేటాయింపు
జూలై 26 (ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:00 వరకు):
పోలింగ్ నిర్వహణ (అదే రోజు సాయంత్రం 4:30 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.

ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీలతో పాటు 3 పురుషుల కమిటీ మెంబర్స్, 2 మహిళా కమిటీ మెంబర్స్ పదవులకు ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి.

మరోవైపు, రాజీనామా చేసిన డ్యాన్సర్స్, సభ్యులు ఈ ఉప ఎన్నికల ప్రక్రియను తీవ్రంగా తప్పుబడుతున్నారు. కేవలం కొన్ని పదవులకే ఎన్నికలు నిర్వహించడం సరికాదని, ప్రస్తుతమున్న మొత్తం కార్యవర్గాన్ని రద్దు చేసి పూర్తి స్థాయి ఎన్నికలకు వెళ్లాలని వారు డిమాండ్ చేస్తున్నారు.. తమతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా అధ్యక్షురాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. రాజీనామా చేసిన సభ్యులందరినీ కలుపుకొని పోవాలని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (TFCC) ఛైర్మన్ దిల్ రాజు, అలాగే ఫెడరెషన్ పెద్దలు సూచించినప్పటికీ.. అధ్యక్షురాలు సుమలతా దేవి వాటిని బేఖాతరు చేస్తూ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని అసమ్మతి వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులపై ఫెడరేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

అయితే అసోసియేషన్ అంతర్గత వ్యవహారాల్లో ఫెడరేషన్ అనవసరంగా జోక్యం చేసుకోకూడదని, బైలాస్ పరిధిలోనే తాము వ్యవహరిస్తున్నామని సుమలతా దేవి వర్గం గట్టిగా వాదిస్తోంది. మొత్తానికి, తీవ్ర విభేదాల నడుమ ప్రకటించిన ఈ ఉప ఎన్నికలు అసోసియేషన్‌లో శాంతిని నెలకొల్పుతాయా.. లేక వివాదాన్ని మరింత రాజేస్తాయా అనేది చూడాలి. జూలై 26న జరగబోయే పోలింగ్ టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ భవిష్యత్ కార్యాచరణను తేల్చనుంది.