మన చేతుల్లోకి ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయ్.. పుకార్లు కాదు RBI చెప్పేసింది !

మన దేశంలో త్వరలో పేపర్ కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ చలామణీలోకి రానుంది. 2027లో ప్లాస్టిక్ కరెన్సీ మనందరికీ అందుబాటులోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. RBI ఈ దిశగా వేగంగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా.. భద్రతా ప్రమాణాలతో కూడిన సెక్యూరిటీ గ్రేడ్ పాలిమర్ సబ్స్ట్రేట్స్ తయారీలో నిపుణుల కోసం అన్వేషిస్తున్నట్లు జులై 17న భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ (BRBNMPL) EOI (Expression Of Interest) జారీ చేయడం గమనార్హం. పాలిమర్ నోట్ల తయారీలో అనుభవం ఉన్న టెక్నాలజీ పార్టనర్స్ కోసం చూస్తున్నట్లు RBI చెప్పుకొచ్చింది. భారతదేశంలో ప్లాస్టిక్ నోట్లు అందుబాటులోకి రావడం ఖాయమని ఈ పరిణామంతో తేలిపోయింది.
🚨 BIG! India moves a step closer to PLASTIC currency notes
RBI has invited global bids for polymer substrate sheets🤯
This may be the first step for plastic banknotes in India💥
Why it matters:
— Polymer notes last much longer than cotton-paper notes
— They can feature… pic.twitter.com/NCarRHQHgi— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) July 17, 2026
RBI ఎప్పటికి అందుబాటులోకి తెస్తుందనే విషయంలో ప్రస్తుతానికి స్పష్టత లేకపోయినప్పటికీ ప్లాస్టిక్ నోట్లను వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో ఈ టెండర్ ఒక పునాది రాయి అని చెప్పొచ్చు. ప్లాస్టిక్ నోట్ల ముద్రణలో ముడి పదార్థాన్ని దిగుమతి చేసుకోవడానికి బదులుగా, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, అనుభవజ్ఞులైన అంతర్జాతీయ సంస్థలతో సహకారం ద్వారా దేశీయ తయారీని నెలకొల్పాలని BRBNMPL భావిస్తోంది. అంటే.. మన ప్లాస్టిక్ కరెన్సీ మన దేశంలో ప్రభుత్వ నోట్ల ముద్రణ సంస్థనే తయారుచేయాలని చూస్తుంది. పాలిమర్ కరెన్సీ నోట్ల సబ్‌స్ట్రేట్‌ల కోసం ఇండియా ఒక స్వదేశీ ఉత్పత్తి వ్యవస్థను నిర్మించుకోవాలని, ఇందుకు సహకరించే కంపెనీలను గుర్తించాలని RBI నిర్ణయించింది.
ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువగా పత్తి ఆధారిత కాగితంతో తయారైన కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటి జీవితకాలం పరిమితంగా ఉండటంతో కొద్ది కాలానికే చిరిగిపోవడం, మురికిగా మారడం, తడిసిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఫలితంగా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) తరచూ కొత్త నోట్లను ముద్రించాల్సి వస్తోంది. ఇది ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం మోపడంతో పాటు ముద్రణ, రవాణా, నిల్వ వంటి ఖర్చులను కూడా పెంచుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్లాస్టిక్ కరెన్సీ ఒక సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ప్రత్యేకమైన ప్లాస్టిక్ పదార్థంతో తయారయ్యే ఈ నోట్లు సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. అవి నీటికి నిరోధకంగా ఉండటమే కాకుండా మురికి, చెమట, తేమ వంటి ప్రభావాలకు కూడా తక్కువగా లోనవుతాయి.