Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Sir Garfield Sobers: క్రికెట్ సామ్రాజ్యంలో ఒక సుదీర్ఘమైన, అద్భుతమైన అధ్యాయం ముగిసింది. ఒకే ఓవర్లో 6 బంతులకు 6 సిక్సర్లు బాదిన ప్రపంచపు మొట్టమొదటి క్రికెటర్‌గా, వెస్టిండీస్ క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చేసిన దిగ్గజ ఆల్‌రౌండర్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ (సార్ గ్యారీ సోబర్స్) ఇకలేరు. బార్బడోస్‌లోని తన నివాసంలో ఆయన కన్నుమూసినట్లు సోబర్స్ కుమారుడు డానియెల్ ధృవీకరించారు. మరో పది రోజుల్లో 90వ వసంతంలోకి అడుగుపెట్టాల్సి ఉండగా ఇంతలోనే తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో ప్రపంచ క్రికెట్ అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
సార్ గ్యారీ సోబర్స్ అంటే క్రికెట్ చరిత్రలోనే అత్యంత మేధావి అయిన ఆల్‌రౌండర్. ఎడమచేతి వాటం బ్యాటింగ్, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించిన ఆయన.. 1954 మార్చి నుంచి 1974 ఏప్రిల్ వరకు వెస్టిండీస్ జట్టుకు అద్భుతమైన సేవలు అందించారు. తన కెరీర్‌లో 93 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన సోబర్స్, ఏకంగా 57.78 సగటుతో 8,032 పరుగులు సాధించారు. ఇందులో 26 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కేవలం బ్యాటింగ్‌తోనే కాకుండా.. బౌలింగ్‌లోనూ మ్యాజిక్ చేస్తూ టెస్టుల్లో 235 వికెట్లు పడగొట్టారు. ఆయన తన కెరీర్‌లో ఒకే ఒక్క వన్డే మ్యాచ్ ఆడగా, అందులోనూ ఒక వికెట్ సాధించడం విశేషం.
టెస్ట్ క్రికెట్‌లో ఆయన రికార్డులు ఎంత ఘనమైనవో, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో సృష్టించిన చరిత్ర అంతకంటే సంచలనాత్మకమైనది. 1968లో నాటింగ్‌హామ్‌షైర్ జట్టు తరఫున ఆడుతూ గ్లామోర్గాన్‌పై ఒకే ఓవర్లో 6 వరుస బంతులను సిక్సర్లుగా మలిచి క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. క్రికెట్ ప్రపంచానికి ఆయన చేసిన అమోఘమైన సేవలకు గుర్తింపుగా.. ఐసీసీ (ICC) 2004 నుంచి ప్రతి ఏటా ఇచ్చే పురుషుల ఉత్తమ క్రికెటర్ అవార్డుకు ‘సార్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ’ అని పేరు పెట్టి ఆయనను గౌరవిస్తూ వస్తోంది. ఇక, సోబర్స్ మరణవార్త తెలియగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రముఖులు, బోర్డులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నాయి. “ఒక గొప్ప ఇన్నింగ్స్ ముగిసింది. మా హృదయాలలో మీరు ఎప్పటికీ నిలిచి ఉంటారు సార్ గార్ఫీల్డ్ సోబర్స్” అంటూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు భావోద్వేగంగా ట్వీట్ చేసింది. అలాగే ఆయన ప్రాతినిధ్యం వహించిన నాటింగ్‌హామ్‌షైర్ కౌంటీ క్లబ్ కూడా, క్రికెట్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన ఆల్‌రౌండర్, తమ క్లబ్ ఐకాన్ అయిన సోబర్స్ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తంచేసింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా సోబర్స్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. క్రికెట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్ అయిన సోబర్స్ సాధించిన విజయాలు, కరేబియన్ క్రికెట్‌పై ఆయన చూపిన ప్రభావం రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని బీసీసీఐ కొనియాడింది. 2024లో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన సమయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు ఇతర భారతీయ ఆటగాళ్లతో సార్ గ్యారీ సోబర్స్ సరదాగా ముచ్చటించిన ఒక ప్రత్యేకమైన వీడియోను పంచుకుంటూ బీసీసీఐ ఆయన కుటుంబ సభ్యులకు, ప్రపంచ క్రికెట్ అభిమానులకు తన హృదయపూర్వక సానుభూతిని తెలియజేసింది. క్రికెట్ ఉన్నంత కాలం సార్ గ్యారీ సోబర్స్ పేరు సజీవంగానే ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆశిద్దాం.