అసలేం జరిగింది… కనిపించకుండా పోయిన నేషనల్ షూటర్..! సీసీటీవీ కెమెరాల్లో ఏముంది..?

దమయంతి 15 ఏళ్ళ నేషనల్ షూటర్. చిన్న వయసులోనే అద్భుత ఆటతీరుతో చురుకైన ప్లేయర్ గా గుర్తింపు సాధించింది. అయితే… హౌరాలోని తమ ఇంటి నుండి సామాన్ల కోసం బయటికెళ్లిన దమయంతి అదృశ్యమవ్వడం కలకలం రేపింది. హౌరాలోని ఉమాచరణ్ భట్టాచార్జీ లేన్‌లో నివసించే ఆమె, ఇటీవల జాతీయ జట్టు ట్రయల్స్‌కు ఎంపికైంది.. పశ్చిమ బెంగాల్ షూటింగ్ సర్క్యూట్‌లో చురుకైన క్రీడాకారిణిగా ఉండేది. ఆమె అదృశ్యం కావడంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు.
దమయంతి గురువారం ( జులై 16 ) మధ్యాహ్నం ఇంటి సామాన్లు కొనడానికి ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదని చెబుతున్నారు కుటుంబసభ్యులు. స్నేహితులు, తోటి షూటర్లు, బంధువులను విచారించినా ఫలితం లేకపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దమయంతి ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
Also Read : మన చేతుల్లోకి ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయ్..
గురువారం నాడు దమయంతి హౌరా రైల్వే స్టేషన్ లోని నాలుగు, ఐదు ప్లాట్‌ఫారాల మధ్య తిరుగుతున్న దృశ్యాలు స్టేషన్ సీసీటీవీ రికార్డయ్యాయి. దమయంతి చివరిసారిగా కనిపించింది ఇదేనని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆమె ఎక్కడికెళ్లింది కనుగొనేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఆమె తన మొబైల్ ఫోన్‌ను తీసుకెళ్లిందని తెలిపారు కుటుంబసభ్యులు.
దమయంతి లైఫ్ స్టైల్ గురించి కుటుంబసభ్యులు:
నేషనల్ టీం కి సెలెక్ట్ అయ్యాక దమయంతి చాలా క్రమశిక్షణతో కూడిన లైఫ్ స్టైల్ పాటిస్తుండేదని… ప్రతిరోజూ ఉదయం ట్రైనింగ్ తీసుకునేదని ఆమె పేరెంట్స్ చెబుతున్నారు. దమయంతి కుటుంబ కలహాలు కూడా ఏమీ లేవని.. ఆమె ఎందుకు అదృశ్యమయ్యిందో తెలియడంలేదని అంటున్నారు కుటుంబసభ్యులు.;
రెండు రోజులు గడిచినా దమయంతి ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు పేరెంట్స్. ఈ కేసును సీరియస్ గా తీసుకున్నామని… అన్ని ఆధారాలు పరిశీలిస్తున్నామని తెలిపారు పోలీసులు.