ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ ఉందా..? డోంట్ వర్రీ.. మందు వచ్చేసింది !

ఫ్యాటీ లివర్ సమస్యతో ఇబ్బంది పడుతున్న బాధితులకు ఊరటనిచ్చే వార్త ఇది. డెన్మార్క్కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా కంపెనీ నోవో నార్డిస్క్ (Novo Nordisk) ఫ్యాటీ లివర్కు వెగోవి పేరుతో మందు కనిపెట్టింది. ఈ మెడిసిన్కు మన దేశ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది. Novo Nordisk తీసుకొస్తున్న ఈ ఫ్యాటీ లివర్ మందును మహారాష్ట్రకు చెందిన ఫార్మా కంపెనీ Emcure మన దేశంలో అందుబాటులోకి తీసుకురానుంది.
ఫ్యాటీ లివర్ ముదిరితే.. మెటబాలిక్ డిస్ఫంక్షన్- అసోసియేటెడ్ స్టీటోహెపటైటిస్ (MASH)కు దారితీస్తుంది. ఇందుకు చికిత్సగా Novo Nordisk ఫార్మా కంపెనీ తయారుచేసిన Wegovy పనిచేస్తుందని సదరు ఫార్మా కంపెనీ తెలిపింది. 2.4mg సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఆమోదం తెలిపింది. ఇండియాలో GLP-1థెరపీకి తొలి అనుమతి పొందిన మెడిసిన్ Wegovy కావడం గమనార్హం.
ఊబకాయం, డయాబెటిస్, సెడెంటరీ లైఫ్ స్టైల్.. ముఖ్యంగా ఈ మూడు కారణాల వల్లే లివర్లో ఫ్యాట్ పేరుకుపోతుంటుంది. ఈ మూడింటికీ ఇన్సులిన్ రెసిస్టెన్స్తో సంబంధం ఉంది. ఐటీ ఉద్యోగుల విషయానికి వస్తే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్లే ఫ్యాటీ లివర్ వస్తోంది. వాళ్లలో చాలామంది ఎక్కువ గంటలు కదలకుండా ఒకే చోట కూర్చోవడం, వ్యాయామానికి దూరంగా ఉండడం, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం లాంటివి చేస్తుంటారు. రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉంటారు. పైగా వాళ్లలో చాలామందికి స్ట్రెస్ ఉంటుంది. దానివల్ల కార్టిజాల్ పెరిగి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇవన్నీ ఫ్యాటీ లివర్కు దారి తీస్తాయి.
ఫ్యాటీ లివర్ మొదటి రెండు దశల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందువల్ల టెస్టులు చేస్తే తప్ప గుర్తించలేం. కానీ.. మూడు లేదా నాలుగో గ్రేడ్లో మాత్రం జాండిస్, చర్మ సంబంధిత సమస్యలు, పొట్ట ఉబ్బరం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే అధిక బరువు ఉన్నవాళ్లు రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకుంటే స్టార్టింగ్ స్టేజీలో తెలుసుకోవచ్చు.
దీనికి బరువు తగ్గడమే సరైన మందు. అప్పటికే తక్కువ బరువు ఉన్నవాళ్లు లైఫ్ స్టయిల్లో మార్పులు చేసుకోవాలి. ఫ్యాటీ లివర్ ప్రభావం ఇమ్యూన్ సిస్టమ్పై కూడా ఉంటుంది. తక్కువ బీఎంఐ ఉన్నా కొందరి బాడీలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. ముఖ్యంగా విసెరల్ ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ఓవర్ వెయిట్ లేకున్నా ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం ఉంది.