July 18, 2026

దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర.. ఉగ్రవాదుల భారీ నెట్‌వర్క్ ఛేదించిన ATS..!

దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర.. ఉగ్రవాదుల భారీ నెట్‌వర్క్ ఛేదించిన ATS..!
Reading Time: < 1 minute
దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర.. ఉగ్రవాదుల భారీ నెట్‌వర్క్ ఛేదించిన ATS..!

గుజరాత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలపై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) భారీ ఆపరేషన్ చేపట్టింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో మరో ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య 13కు చేరింది. అరెస్టైన నిందితులకు నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఏ-మహ్మద్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థల ప్రాథమిక విచారణలో తేలింది.

ఇప్పటికే అరెస్టైన ఎనిమిది మంది నిందితుల విచారణలో లభించిన కీలక సమాచారంతో తాజా దాడులు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. నిందితులు పేలుడు పదార్థాల తయారీ, బాంబులను టైమర్ సాయంతో పేల్చే విధానాలపై శిక్షణ పొందేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. గత మూడేళ్లలో రాష్ట్రంలోని ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో బాంబు పేలుడు పరీక్షలు నిర్వహించినట్లు ఏటీఎస్ దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకు అవసరమైన పేలుడు పదార్థాలను ఆన్‌లైన్‌తో పాటు స్థానిక మార్కెట్ల నుంచి కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు.

అరెస్టైన వారిలో ఇద్దరు జమ్మూకశ్మీర్‌లో ఏకే-47 ఆయుధాల వినియోగంపై శిక్షణ పొందినట్లు దర్యాప్తులో బయటపడింది. అలాగే కార్బన్ మోనాక్సైడ్ తయారీకి సంబంధించిన శిక్షణ కూడా పొందినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నిందితుల్లో ఒకరు వడోదరకు చెందిన వ్యక్తితో తరచూ సంప్రదింపులు జరిపినట్లు కూడా గుర్తించారు.

దర్యాప్తులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. నిందితులు జిహాద్ భావజాలానికి సంబంధించిన 43 పుస్తకాలను డౌన్‌లోడ్ చేసినట్లు ఏటీఎస్ గుర్తించింది. ఖాదియాసన్ మదరసాలో కొందరు అనుమానితుల కదలికలపై కూడా అధికారులు నిఘా పెట్టినట్లు సమాచారం. నందాసన్ ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లోనే తాజా అరెస్టులు జరిగినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అరెస్టైన ఎనిమిది మంది నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరచగా, తాజా ఐదుగురు నిందితులకు మరో ఏడు రోజుల పోలీసు రిమాండ్ మంజూరైంది. కడి కోర్టు పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు, కమాండోలు మోహరించారు. ఈ కేసులో ఉగ్రవాద నెట్‌వర్క్, శిక్షణ, ఆర్థిక లావాదేవీలు, ఇతర సంబంధాలపై ఏటీఎస్ దర్యాప్తు మరింత విస్తరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..