Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!

2026 నీట్-యూజీ పరీక్షలో జరిగిన అక్రమాలపై నిరసనగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. శుక్రవారానికి 20 రోజులు పూర్తయ్యాయి. వాంగ్‌చుక్‌కు పలువురు రాజకీయ నాయకులు సంఘీభావం తెలుపుతున్నారు. గురువారం ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కలిసి సంఘీభావం తెల్పగా.. శుక్రవారం అఖిలేష్ యాదవ్ భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ కలిశారు.
అయితే డింపుల్ యాదవ్ స్టేజ్‌పైకి వస్తుండగా ఆమెను పరిచయం చేసే క్రమంలో అనౌన్సర్ పొరపాటున డింపుల్ యాదవ్ అని సంభోదించకుండా ‘డింపుల్ కపాడియా జీ’ సోనమ్ వాంగ్‌చుక్‌ను కలిసేందుకు వస్తున్నారని పలికాడు. దీంతో దీక్షలో కూర్చున్న వారంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. ఉద్వేగంగా ఉన్న వాతావరణం కాస్త ఉల్లాసభరితంగా మారిపోయింది.
డింపుల్ కపాడియా ప్రముఖ బాలీవుడ్ నటి. అయితే డింపుల్ యాదవ్ అని పిలవకుండా హీరోయిన్ పేరు ఉచ్ఛరించడంతో దీక్షలో ఉన్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. అనంతరం వ్యాఖ్యాతకు విషయం తెలియజేయడంతో సరిదిద్దుకున్నాడు. జరిగిన దానికి క్షమాపణ చెప్పి.. ‘‘డింపుల్ యాదవ్ జీ..’’అంటూ సరిచేసి తిరిగి పరిచయం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ ప్రశ్నాపత్రాల లీక్, విద్యా వ్యవస్థలో అవకతవకలు, సీబీఎస్‌ఈ ఆన్‌స్క్రీన్ మూల్యాంకన విధానంపై నిరసనగా సోనం వాంగ్‌చుక్ గత 20 రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్షకు విపక్ష నాయకులు మద్దతు తెలుపుతున్నారు. ఇక డింపుల్ యాదవ్ పర్యటనకు రెండు రోజుల ముందు ఆమె భర్త, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సోనం వాంగ్‌చుక్‌తో ఫోన్‌లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని దీక్ష విరమించాలని కోరారు. అనంతరం గురువారం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా జంతర్‌మంతర్‌కు వెళ్లి వాంగ్‌చుక్‌కు మద్దతు తెలిపారు.
మరోవైపు వాంగ్‌చుక్ దీక్షపై ఢిల్లీ హైకోర్టు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తొలిసారి స్పందించింది. ప్రభుత్వ వైద్యులు ప్రతిరోజూ ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని, అవసరమైతే తక్షణమే వైద్య సేవలు అందిస్తామని కోర్టుకు హామీ ఇచ్చింది. అలాగే సోనం వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజూ పరిశీలించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కూడా కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అంతేకాకుండా సోనమ్ దీక్షకు మద్దతు కూడా తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
