Parthiv Patel: హిట్‌మ్యాన్‌ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

Parthiv Patel: రోహిత్ శర్మ వన్డే భవితవ్యంపై రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతున్న వేళ.. భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్‌తో ఆదివారం లార్డ్స్ వేదికగా జరగబోయే సిరీస్ డిసైడర్ మ్యాచ్ రోహిత్‌కు ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ కాబోతోందనే ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో విమర్శకులకు తనదైన శైలిలో సమాధానం చెప్పే సత్తా రోహిత్‌కు ఉందని పార్థివ్ పటేల్ గట్టిగా మద్దతు పలికాడు. ఈ 39 ఏళ్ల వెటరన్ ఓపెనర్ తన కెరీర్ ముగింపులో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ (మాస్టర్‌పీస్) ఆడగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుత సిరీస్‌లో రోహిత్ శర్మ పేలవ ఫామ్ కారణంగా అతని భవిష్యత్తుపై ప్రశ్నలు మరింత ఎక్కువయ్యాయి. మొదటి రెండు వన్డేల్లో ఆయన కేవలం 11, 26 పరుగులు మాత్రమే చేశాడు. గత ఎనిమిది వన్డే మ్యాచ్‌లలో రోహిత్ కేవలం 241 పరుగులు మాత్రమే చేయడంతో.. 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో భాగంగా రోహిత్ తర్వాత జట్టు భవిష్యత్తుపై బీసీసీఐ ఇప్పుడే కసరత్తులు మొదలుపెట్టనుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, ఇలాంటి ఒత్తిడి సమయాల్లో పుంజుకోవడం రోహిత్‌కు కొత్తేమీ కాదని పార్థివ్ పటేల్ గుర్తుచేశాడు.
“ఒకవేళ లార్డ్స్ వన్డేనే రోహిత్ శర్మ కెరీర్‌లో చివరి మ్యాచ్ అయితే.. అతను ఒక సెంచరీతో ఘనంగా వీడ్కోలు పలకాలని అనుకుంటాడు. అలా చేసే సామర్థ్యం అతనికి ఖచ్చితంగా ఉంది. రెండు మూడు మ్యాచ్‌ల్లో తక్కువ పరుగులకే అవుట్ అయిన తర్వాత, ఆ వెంటనే తర్వాతి ఇన్నింగ్స్‌లోనే మ్యాచ్ విన్నింగ్ నాక్‌తో రోహిత్ పుంజుకోవడం మనం అతని కెరీర్ పొడవునా చూశాం” అని జియోహాట్‌స్టార్ (JioHotstar) ‘మ్యాచ్ సెంటర్ లైవ్’ కార్యక్రమంలో పార్థివ్ పేర్కొన్నాడు. జట్టుకు అత్యంత అవసరమైన సమయంలో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసే ఇన్నింగ్స్‌లు ఆడటమే రోహిత్ శర్మ ప్రత్యేకత అని పార్థివ్ విశ్లేషించాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకరైన రోహిత్.. ఇప్పటివరకు 11 వేలకు పైగా పరుగులు, 33 సెంచరీలు సాధించడమే కాకుండా, వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. “విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకు ఉన్న ముఖ్యమైన తేడా కన్సిస్టెన్సీ (స్థిరత్వం). రోహిత్ ప్రతి మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు చేయకపోవచ్చు, కానీ ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే మాత్రం సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపిస్తాడు. అందుకే అతను ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకుంటాడు” అని పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు.
కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో పిచ్‌పై ఉన్న అసమాన బౌన్స్ కారణంగా రోహిత్ ఇబ్బంది పడ్డాడని, అయితే లార్డ్స్ లాంటి చారిత్రాత్మక వేదికపై విమర్శకుల నోళ్లు మూయించడానికి ఇదొక మంచి అవకాశమని పార్థివ్ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ ఇదే ఆఖరి వన్డే అయితే, ప్రజలు జీవితాంతం గుర్తుంచుకునేలా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌తో రోహిత్ కెరీర్ ముగించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. మరోవైపు టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కూడా రోహిత్ ఫామ్‌పై వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. కఠినమైన పిచ్ పరిస్థితుల వల్లే పరుగులు రాలేదని, రోహిత్ ఎలాంటి ఒత్తిడిలో లేడని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం 1-1తో సిరీస్ సమం కాగా, జూలై 19 ఆదివారం లార్డ్స్ వేదికగా జరగబోయే ఆఖరి సమరంలో అందరి కళ్లు రోహిత్ శర్మపైనే ఉన్నాయి.