Reading Time: < 1 minute

2024 ఎన్నికల్లో లాగా ఇప్పుడు తగ్గేది లేదు..! స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: నాదెండ్ల మనోహర్ 

Caption of Image.

ఏపీలో స్థానిక ఎన్నికల్లో జనసేన పోటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం కోసం నాలుగు అడుగులు వెనక్కి తగ్గామని… క్షేత్రస్థాయిలో బలాబలాలు బేరీజు వేసుకొని స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తామని అన్నారు.శుక్రవారం ( జులై 17 ) తెనాలి నియోజకవర్గం చెంచుపేటలో మీడియాతో మాట్లాడుతూ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు నాదెండ్ల మనోహర్. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ సమాయత్తమవుతోందని అన్నారు. 

పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో జనసేన తప్పకుండా పోటీ చేస్తుందని… ఇప్పటం సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనకు కట్టుబడి.. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపును దృష్టిలో ఉంచుకుని త్యాగాలు చేశామని అన్నారు.  అదే ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వర్తిస్తుందనుకోవడం పొరపాటని అన్నారు నాదెండ్ల మనోహర్. 

జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీ చేస్తుందని… నాయకులు, జన సైనికులు, వీరమహిళలకు తగిన అవకాశాలు కల్పించేలా పార్టీ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో కూటమి భాగస్వామ్యాన్ని గౌరవిస్తూ అన్ని పార్టీలతో సమన్వయం కొనసాగిస్తామని అన్నారు. 

ప్రజల మేలు కోసం ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసేందుకు 2024 ఎన్నికల సమయంలో నాలుగు అడుగులు వెనక్కి తగ్గామని… అప్పట్లో తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలతో ముడిపెడుతూ వచ్చిన వార్తలు సరికావని అన్నారు నాదెండ్ల మనోహర్

క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు, వీరమహిళల అభిప్రాయాలు, ఆకాంక్షలు, ఆవేదనలను పార్టీ నాయకత్వం పూర్తిగా అర్థం చేసుకుందని…  పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతామని అన్నారు.

©️ VIL Media Pvt Ltd.