Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..

రోజూ వంట చేయడం వల్ల గ్యాస్ బర్నర్లు నల్లగా మారిపోతుంటాయి. వాటిపై నూనె, జిడ్డు, మసాలాలు పేరుకుపోవడం వల్ల బర్నర్ రంధ్రాలు పూడుకుపోతాయి. దీనివల్ల గ్యాస్ మంట (ఫ్లేమ్) బలహీనపడి, వంట చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాకుండా.. గ్యాస్ సిలిండర్ కూడా త్వరగా అయిపోతుంది. సాధారణంగా కడిగితే ఈ నల్లటి జిడ్డు వదిలిపోదు. కాబట్టి.. ఇంట్లోనే సులభంగా గ్యాస్ బర్నర్లను కొత్తవాటిలా మెరిపించే ఒక అద్భుతమైన చిట్కాను ఇప్పుడు చూద్దాం.
కావలసిన వస్తువులు..
టూత్‌పేస్ట్, వైట్ వెనిగర్ (సిరకా), ఈనో (Eno) ప్యాకెట్, పాత టూత్‌బ్రష్, వేడి నీళ్లు.
శుభ్రం చేసే విధానం..
స్టెప్ 1 (టూత్‌పేస్ట్ రాయడం): మొదట గ్యాస్ స్టవ్ నుంచి బర్నర్లను వేరు చేయాలి. బర్నర్లపై కొద్దిగా టూత్‌పేస్ట్ వేసి, పాత టూత్‌బ్రష్ సహాయంతో బర్నర్ చుట్టూ, రంధ్రాలకు బాగా పట్టేలా రాయాలి. టూత్‌పేస్ట్ జిడ్డును వదిలించడమే కాకుండా రంధ్రాలలో ఉన్న మొండి వ్యర్థాలను లూజ్ చేస్తుంది.
స్టెప్ 2 (వెనిగర్, ఈనో మిశ్రమం): టూత్‌పేస్ట్ రాసిన బర్నర్లను ఒక చిన్న గిన్నెలో పెట్టాలి. అందులో బర్నర్లు మునిగేలా వైట్ వెనిగర్ పోయాలి. ఆ వెంటనే ఒక ఈనో ప్యాకెట్ పొడిని దానిపై చల్లాలి. వెనిగర్, ఈనో కలవడం వల్ల కెమికల్ రియాక్షన్ జరిగి నురుగు వస్తుంది. ఆపై కొద్దిగా వేడి నీళ్లు పోసి, 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. కాసేపటికీ బర్నర్‌లోని మురికి అంతా వదిలి నీరు నల్లగా మారడం గమనించవచ్చు.
స్టెప్ 3 (బ్రష్‌తో రుద్దడం): 20 నిమిషాల తర్వాత బర్నర్లను బయటకు తీసి, పాత బ్రష్‌తో రెండు మూడు నిమిషాల పాటు బాగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల రంధ్రాలలో ఇరుక్కున్న మురికి పూర్తిగా తొలగిపోతుంది. చివరగా శుభ్రమైన నీటితో కడిగి, పొడి బట్టతో తుడిచి కాసేపు ఎండలో లేదా గాలికి ఆరబెట్టి స్టవ్‌కు అమర్చాలి.
గ్యాస్ బర్నర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల గ్యాస్ ఆదా అవ్వడమే కాకుండా, వంట కూడా వేగంగా పూర్తవుతుంది. వారానికి లేదా పది రోజులకు ఒకసారి ఈ చిట్కా పాటిస్తే బర్నర్లు ఎల్లప్పుడూ కొత్తవాటిలా మెరుస్తూ ఉంటాయి.