బ్రిటన్కు కొత్త ప్రధాని బర్న్హామ్..! ఆయన ముందున్న సవాళ్లు ఇవే

బ్రిటన్ కు కొత్త ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు చేపట్టునున్నారు. లేబర్ పార్టీ నాయకుడిగా ఎన్నికైన ఆయన.. పదవీ విరమణ చేస్తున్న ప్రస్తుత ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ స్థానంలో యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) బాధ్యతలు చేపడతారు. లేబర్ పార్టీ నాయకత్వానికి జరిగిన పోటీలో 403 మంది ఎంపీలలో 379 మంది ఆయనకు మద్దతు పలికారు. దీంతో నామినేషన్ కు కావాల్సిన లిమిట్ ను సునాయాసంగా దాటారు. నాయకత్వ ఎన్నికలో వేరెవరూ పోటీకి నిలవక పోవడం గమనార్హం.
కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని బర్న్‌హామ్‌ను కింగ్ చార్లెస్ III ఆహ్వానించడానికి ముందే, స్టార్మర్ సోమవారం (జులై 20) అధికారికంగా రాజీనామా చేస్తారు. బార్మర్ నియామకంతో యూకేలో లేబర్ పార్టీ ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది.
ఆండీ బర్న్‌హామ్ ఎవరు?
ఆండీ బర్న్‌హామ్ లేబర్ పార్టీలోని అత్యంత సీనియర్ నాయకులలో ఒకరు. 2017 నుంచి గ్రేటర్ మాంచెస్టర్ మేయర్‌గా ఉన్నారు. ప్రాంతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు, మాజీ ప్రధానమంత్రి గోర్డాన్ బ్రౌన్ హయాంలో ఆరోగ్య కార్యదర్శి, సాంస్కృతిక కార్యదర్శి, ట్రెజరీ చీఫ్ సెక్రటరీతో సహా పలు సీనియర్ క్యాబినెట్ పదవులను నిర్వహించారు.
మాంచెస్టర్, లివర్‌పూల్ మధ్య ఉన్న కల్చెత్‌లో ఒక కార్మిక కుటుంబంలో జన్మించిన బర్న్‌హామ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లో పట్టా పొందారు. తన కుటుంబంలో విశ్వవిద్యాలయానికి వెళ్లిన మొదటి వ్యక్తి ఆయనే. పొలిటికల్ కెరీర్ లో నార్త్ ఇంగ్లాండ్ కు బలమైన మద్దతుదారుడిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆయనను కింగ్ ఆఫ్ నార్త్.. అని పిలుస్తారు.
ఆండీ బర్న్‌హామ్ కే ఎందుకు ప్రధానమంత్రి బాధ్యతలు:
లేబర్ పార్టీకి లోకల్ బాడీ ఎలక్షన్లలో ఘోర ఓటములు ఎదురయ్యాయి. ఈ క్రమంలో కీర్ స్టార్మర్ దిగి పోవాలని ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. ఈ తరుణంలో బర్న్‌హామ్ దేశంలో అత్యున్నత పదవికి ఎదిగారు. నాయకత్వ పోటీకి అర్హత సాధించడానికి, బర్న్‌హామ్ మొదట మేకర్‌ఫీల్డ్ పార్లమెంటరీ ఉప ఎన్నికలో పోటీ చేసి గెలుపొందారు. యూకేకు చెందిన రాబర్ట్ కెన్యాన్‌ను 9 వేల ఓట్లకు పైగా తేడాతో ఓడించారు.
లేబర్ ఎంపీల నుంచి మరే ఇతర అభ్యర్థికీ తగినంత మద్దతు లభించకపోవడంతో, పార్టీకి నాయకత్వం వహించడానికి బర్న్‌హామ్ ఎన్నికయ్యారు.
ఆండీ బర్న్‌హామ్ రాజకీయ ప్రస్థానం:
బర్న్‌హామ్ వెస్ట్‌మిన్‌స్టర్‌లో రాజకీయవేత్తగా, ప్రాంతీయ నాయకుడిగా ఇరవై సంవత్సరాలకు పైగా ప్రజా జీవితంలో గడిపారు. గ్రేటర్ మాంచెస్టర్ మేయర్‌గా, బీ నెట్‌వర్క్‌ను అమలు చేశారు. ఇది పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ఒక ప్రధాన సంస్కరణ, దీని ద్వారా బస్సు సర్వీసులను లోకల్ కంట్రోల్ లోకి తీసుకొచ్చారు.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో, ప్రాంతీయ లాక్‌డౌన్‌ల సందర్భంగా గ్రేటర్ మాంచెస్టర్‌కు ఆర్థిక సహాయం అందించే విషయంలో ఆయన యూకే ప్రభుత్వంతో బహిరంగంగా పోరాడటంతో, జాతీయ స్థాయిలో ఆయన ప్రాముఖ్యత గణనీయంగా పెరిగింది. ఈ వివాదం ఆయన్ను ఉత్తరాది జాతీయ యోధుడిగా మార్చింది. లేబర్ పార్టీలో ఆయన స్థానాన్ని సుస్థిరం చేసింది.
యూకేలో పరిణామాలను మార్చగలరా..?
బర్న్‌హామ్ తన పాలసీ ప్లాట్ ఫామ్ ఏంటో ఇంక ప్రకటించలేదు. కానీ ఆయన ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రజా సేవలు, రవాణా సంస్కరణలు, వెస్ట్‌మిన్‌స్టర్ నుండి అధికారాల వికేంద్రీకరణపై దృష్టి పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. గ్రేటర్ మాంచెస్టర్‌ను నడిపించిన అనుభవం, స్థానిక సంస్థలకు సాధికారత కల్పించడం, ప్రాంతీయ అసమానతలను పరిష్కరించడంపై ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, ప్రధానమంత్రిగా ఆయన తనదైన మార్క్ వేస్తాడని భావిస్తున్నారు.
ఆండీ బర్న్‌హామ్ పదవీ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమవుతున్న తరుణంలో, లేబర్ పార్టీ వాగ్దానాలను ఎలా నెరవేరుస్తాడు.. యునైటెడ్ కింగ్‌డమ్ ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక ఇబ్బందులను ఎలా పరిష్కరిస్తాడు అనే దానిపై అందరూ ఎదురు చూస్తున్నారు.