కరీంనగర్: బదిలీ అయినా పోతలేరు…ఉన్నచోటి నుంచి కదలని హోంగార్డులు

- బదిలీ అయి 10 రోజులైనా రిలీవ్ కాకుండా అక్కడే విధులు
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ట్రాన్స్ ఫర్ అయిన 373 మందిలో సుమారు 100 మందిది ఇదే పరిస్థితి
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఇటీవల ట్రాన్స్ ఫర్ అయిన హోంగార్డులు కొందరు ఉన్న చోట నుంచి కదిలేందుకు ససేమిరా అంటున్నారు. ఇతర జిల్లాలకు బదిలీ అయినప్పటికీ వెళ్లడం లేదు. వారు రిలీవ్ కాకపోవడంతో వారి స్థానంలోకి రావాల్సిన హోంగార్డులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇలా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 100 మంది వరకు ట్రాన్స్ ఫర్ అయిన స్థానాలకు వెళ్లలేదని తెలుస్తోంది.
పారదర్శకత కోసం లాటరీ పద్ధతిలో నిర్వహించినా పరిస్థితి మారలేదు. పొలిటికల్ గా, ఆఫీసర్లతో పరిచయం ఉన్న హోంగార్డులు కరీంనగర్‌లో వచ్చి విధుల్లో చేరుతుండగా.. ఏ అండ లేనివారు మాత్రం రూరల్ జిల్లాల్లోనే ఉండిపోతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రాన్స్ ఫర్ అయి 10 రోజులైనా కొందరికి రిలీవ్ ఆర్డర్స్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 373 మంది హోంగార్డుల ట్రాన్స్ ఫర్
తెలంగాణ ఏర్పాటు తర్వాత 2016లో జిల్లాల పునర్విభజన జరిగిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లా నుంచి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలుగా విడిపోగా కొన్ని మండలాలను సిద్ధిపేట, జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ జిల్లాల్లో చేర్చారు. జిల్లాల ఏర్పాటైన తొమ్మిదేళ్ల తర్వాత 2025 మేలో తొలిసారిగా హోంగార్డుల ట్రాన్స్ ఫర్లు జరిగాయి. ఆ సమయంలో ఏఆర్ పోలీసాఫీసర్ ఒకరు భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలోనే సిబ్బందిలో జవాబుదారీతనం పెంచడం, రొటేషన్ పద్ధతిలో దూరంలో ఉన్న వారు దగ్గరికి రావడం, దగ్గరిలో ఉన్నవారు దూరం వెళ్లడం అనే విధానాన్ని అమలు చేయడంలో భాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 373 మంది హోంగార్డులను ట్రాన్స్ ఫర్ చేశారు. వీరిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వితంతు మహిళలు, తీవ్ర అనారోగ్య బాధితులు, మానసిక వికలాంగ పిల్లలు ఉన్నవారు, జూన్ 2027 లోపు పదవీ విరమణ చేయనున్న హోంగార్డుల జాబితాను అందరి సమక్షంలో కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని హాల్ లో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ప్రదర్శించారు. మిగతావారికి అందరి సమక్షంలో చీటీల(లాటరీ) ద్వారా ట్రాన్స్ ఫర్ చేశారు.
ఉన్న ప్రాంతాలను వదలడం ఇష్టం లేకే..
ట్రాన్స్ ఫర్ అయిన సుమారు 250 మంది వరకు హోంగార్డులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో చేరినప్పటికీ.. మరో 100 మందికి చేరకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు తమకు అనుకూలమైన ఆఫీసర్లను, పోలీస్ స్టేషన్లను వదిలి వెళ్లడం ఇష్టంలేక రిలీవ్ అయ్యేందుకు సిద్ధంగా లేరని తెలిసింది. తాము తక్కువ జీతాలతో పనిచేసే ఉద్యోగులమని, ఏడాదికోసారి ట్రాన్స్ ఫర్ అంటే ఎలా అని వాపోతున్నారు.
ఇప్పటికే తమ పిల్లల స్కూల్, కాలేజీ ఫీజులు చెల్లించిన వారికి కూడా ట్రాన్స్ ఫర్ ఇబ్బందికరంగా మారింది. దీంతో చాలామంది హోంగార్డులు ట్రాన్స్ ఫర్ అయిన స్థానాల్లో చేరేందుకు సిద్ధంగా లేరు. హోంగార్డుల ఇబ్బందులు, వారి అవసరాన్ని కొందరు ఆర్ఐలు క్యాష్ చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలిసింది.