Gas Cylinders: గ్యాస్ సిలిండర్లకు కొత్త రూల్స్.. నిబంధనల్లో కేంద్రం భారీ మార్పులు.. గైడ్‌లైన్స్ జారీ..
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల కోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. గత ఐదు నెలలుగా చమురు మార్కెటింగ్ కంపెనీలు, ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ రూల్స్‌ను సవరించాయి. సిలిండర్ రీఫిల్లింగ్, బుకింగ్ నుంచి సరెండర్ వరకు మార్పులు చోటుచేసుకున్నాయి. పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ), గృహ, వాణిజ్య వంటగ్యాస్ కోసం అనేక నిబంధనలు కొత్తగా తీసుకొచ్చారు. గ్యాస్ సిలిండర్లను సజావుగా బుక్ చేసుకోవడానికి లేదా రద్దు చేసుకోవడానికి తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.
గ్యాస్ సిలిండర్ల బుకింగ్ కోసం 25 రోజులు, 45 రోజుల నియమం తీసుకొచ్చారు. ఈ సిలిండర్లు డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్ల వినియోగదారులకు వర్తి్స్తాయి. పట్టణ ప్రాంతాల్లో ఒక సిలిండర్ బుక్ చేశాక మరోక సిలిండర్ బుకింగ్ కోసం 25 రోజుల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆలోపు మీరు బుక్ చేసినా ఆటోమేటిక్‌గా సిస్టమ్ రద్దు చేస్తోంది. మీరు బుకింగ్ చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాదు ఇక గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ వెయిటింగ్ పీరియడ్ 45 రోజులుగా ఉంది
ఇండేన్, హెచ్‌పి గ్యాస్, భారత్ గ్యాస్‌లకు ఈ నియమం వర్తిస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం మే నెలాఖరులో 30 రోజుల నిబంధన తీసుకొచ్చింది. ఈ సవరణ ప్రకారం.. ఎల్పీజీ వినియోగదారులు పీఎన్జీ కనెక్షన్లు పొందిన 30 రోజుల్లోపు తమ ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పి గ్యాస్ కనెక్షన్లను తప్పనిసరిగా రద్దు చేసుకోవాలి. మళ్లీ తిరిగి ఎల్పీజీలోకి మారినప్పుడు ట్రాన్స్ఫర్ వొచర్ ద్వారా పొందవచ్చు. పీఎన్జీ పైప్ లైన్లు అందుబాటులో ఉన్న ప్రాంతాల ప్రజలు తప్పనిసరిగా అందులోకి మారాలి.
కొత్త LPG సిలిండర్ల కనెక్షన్ కావాలంటే కేవైసీ (నో యువర్ కస్టమర్) దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయాలి. అనంతరం ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డు వంటి గుర్తింపు పత్రాలు అవసరం. అలాగే విద్యుత్/నీటి/టెలిఫోన్ బిల్లు, రేషన్ కార్డు, ప్రస్తుత చిరునామాతో కూడిన ఆధార్ కార్డు, అద్దె లేదా లీజు ఒప్పందం, చిరునామాతో కూడిన పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి చిరునామా రుజువులు అందించాలి. పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లతో పాటు సబ్సిడీని పొందేందుకు అర్హత పొందాలనుకుంటే, బ్యాంకు ఖాతా వివరాలు కూడా అవసరం.
ఇక గ్యాస్ కనెక్షన్లను రద్దు చేసుకోవాలంటే.. ఎల్పీజీ వినియోగదారుల పుస్తకం లేదా సబ్స్క్రిప్షన్ వోచర్ (SV) అందించాలి. ధృవీకరణ కోసం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి అవసరం. రాతపూర్వక దరఖాస్తు లేదా LPG కనెక్షన్ రద్దు ఫారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక సిలిండర్, పాస్ బుక్,సబ్స్క్రిప్షన్ వోచర్ వెనక్కి ఇవ్వాలి.




