Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన

Monsoon: రైతులకు గుడ్ న్యూస్. రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ దేశంలో లోటు వర్షపాతమే ఉంది. ఈ నేపథ్యంలో తాజా వార్త ప్రజలకు కాస్త ఊరట ఇస్తోంది. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో అనేక వాతావరణ వ్యవస్థలు అనుకూలమైన ప్రదేశాల్లో ఏర్పడుతున్నాయి. వీటిలో కొన్ని బంగాళాఖాతానికి చేరితే, రుతుపవనాలు మళ్లీ జోరందుకునే అవకాశం ఉంది. జూలై 18 నుంచి 25 మధ్య రుతుపవనాలు చురుకుగా మారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాస్త్రవేత్తలు పరిస్థితినిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ప్రారంభమైనప్పటికీ అనుకున్నంతగా దేశవ్యాప్తంగా వర్షాలు పడలేదు. తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో సరైన వర్షాలు లేక కరువు ఛాయలు అలుముకున్నాయి. దీని వల్ల ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పప్పుధాన్యాలు ప్రభావితమవుతున్నాయి. జలాశయాల నీటిమట్టాలు కూడా తగ్గిపోతున్నాయి, ఇది తాగునీరు మరియు సాగునీటికి ఆందోళన కలిగిస్తోంది.
వాతావరణ శాఖ చెబుతున్న దాని ప్రకారం.. రుతుపవన ద్రోణి తన సాధారణ స్థానం నుంచి పక్కకు జరగడంతో తగినంత తేమతో కూడిన గాలులు ఈ ప్రాంతానికి చేరడం లేదు. ఈ నేపథ్యంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణమండల వ్యవస్థలు లేదా అల్పపీడన వ్యవస్థలు ఏర్పడుతున్నాయి. ఈ వ్యవస్థలు పశ్చిమం వైపు కదిలి భారత దేశానికి సమీపంలోని బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తే అవి రుతుపవనాలను బలోపేతం చేస్తాయి. ECMWF, GFS, IMD వంటి అంతర్జాతీయ, భారతీయ వాతావరణ సంస్థలు కూడా ఇదే అవకాశాన్ని సూచిస్తున్నాయి.
ఉత్తర భారతదేశానికి ‘‘వెస్ట్రన్ డిస్టబెన్స్’’ ఉపశమనం:
మరోవైపు, వెస్ట్రన్ డిస్టబెన్స్‌గా పిలిచే వాతావరణ వ్యవస్థ ప్రభావంతో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, పశ్చిమ రాజస్థాన్‌లలో రాబోయే రెండు మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
‘‘వెస్ట్రన్ డిస్టబెన్స్’’ అనేవి హిమాలయ ప్రాంతం నుండి ఉద్భవించే పశ్చిమ గాలుల వ్యవస్థలు, ఇవి శీతాకాలంలో హిమపాతాన్ని మరియు వేసవిలో వర్షపాతాన్ని కలుగజేస్తాయి. ఈ సంవత్సరం, ఇవి రుతుపవనాల లోటును పాక్షికంగా భర్తీ చేయగలవు.
జూలై 18-25 కీలకం:
జూలై 18 నుంచి 25 మధ్య కాలాన్ని వాతావరణ నిపుణులు చాలా కీలకంగా భావిస్తారు. ఈ సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడన వ్యవస్థలు బలపడితే మధ్య భారత్, ఉత్తర భారత్, గుజరాత్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒక వేళ ఈ వాతావరణ వ్యవస్థలు బలహీనపడినా, దిశ మార్చుకున్నా వర్షాభావ పరిస్థితులు కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఐఎండీ ఈ పరిస్థితుల్ని జాగ్రత్తగా పర్యవేక్షిస్తోంది.