Reading Time: < 1 minute
Anantapur Sbi Atm Theft Robbers Steal Atm Machine Loot Cash And Dump It In Fields

Robbers Steal SBI ATM Machine in Bukkarayasamudram: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటీఎం దొంగల ముఠా మరోసారి రెచ్చిపోయింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఎస్‌బీఐ ఏటీఎం మిషన్‌ను పూర్తిగా పెకలించి ఎత్తుకెళ్లారు. అనంతరం నగదును దోచుకుని మిషన్ పరికరాలను సింగనమల మండలం ఆకులేడు గ్రామ సమీపంలోని పొలాల్లో పడేసి పరారయ్యారు. కేసు చేసుకున్న పోలీసులు పలు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసుల ప్రాథమిక విచారణ వివరాల ప్రకారం.. దుండగులు బొలెరో వాహనంలో వచ్చి తాడు సహాయంతో ఎస్‌బీఐ ఏటీఎం మిషన్‌ను లాగి బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటన మొత్తం ఏటీఎం వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దుండగులు అత్యంత ప్రణాళికాబద్ధంగా ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఏటీఎం మిషన్ కనిపించకపోవడంతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సింగనమల మండలం ఆకులేడు గ్రామ పరిధిలోని పొలాల్లో ఏటీఎం మిషన్ పరికరాలు గుర్తించారు. నగదును తీసుకుని మిషన్‌ను అక్కడ పడేసి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏటీఎంలో ఎంత మొత్తం నగదు ఉందనే విషయాన్ని బ్యాంకు అధికారులు నిర్ధారించాల్సి ఉంది.

ఏటీఎం చోరీపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం వేలిముద్రలను సేకరించగా, డాగ్ స్క్వాడ్ సహాయంతో పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠా ఈ ఘటనలో పాల్గొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గత నెలలో ధర్మవరంలో కూడా ఇదే తరహాలో దుండగులు బొలెరో వాహనం సాయంతో ఏటీఎంను లాగి ఎత్తుకెళ్లారు. వారం రోజుల క్రితం గుంతకల్లులోనూ ఏటీఎం చోరీకి ప్రయత్నించారు. వరుస ఘటనల నేపథ్యంలో ఒకే ముఠా ఈ దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఏటీఎం చోరీల వెనుక ఉన్న ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా దృశ్యాలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా దుండగుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వరుస ఏటీఎం చోరీలు కలకలం రేపుతున్నాయి.