Reading Time: < 1 minute

అద్దె ఇంట్లో ట్యాప్ లీకైనా.. గోడ పగిలినా రిపేర్స్ ఖర్చు ఎవరు భరించాలి? రూల్స్ ఏం చెబుతున్నాయి?

Caption of Image.

ఈ రోజుల్లో ఇల్లు మారడం అంటే కేవలం సామాన్లు సర్దుకోవడం మాత్రమే కాదు. కొత్త బాధ్యతలను నెత్తినేసుకోవడం. అద్దెకు దిగిన ఇంట్లో అర్ధరాత్రి ట్యాప్ లీకైనా, గోడకు పగుళ్లు వచ్చినా.. ‘ఎవరిది బాధ్యత?’ అనే గొడవ ప్రతిచోటా కామనే. యజమానిదా? కిరాయిదారుదా? ఈ తలనొప్పికి చెక్ పెడుతూ.. ఇండియా తీసుకొచ్చిన ‘మోడల్ టెనెన్సీ యాక్ట్, 2021’ క్లారిటీ ఇచ్చింది. ఆ రూల్స్ తెలిస్తే లీగల్ చిక్కులు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు.

ఇల్లు యజమానిదే బాధ్యత:
ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడు ఎలా ఉందో.. అలాగే ఉంచడం ఇద్దరి బాధ్యత. అయితే మేజర్ రిపేర్లు, మెయింటెనెన్స్ అంతా యజమానిదే. ఒకవేళ ఓనర్ ఆ పనులు చేయనని మారాం చేస్తే.. టెనెంట్ ఆ రిపేర్లు తనే చేయించుకోవచ్చు. ఆ ఖర్చును నెలవారీ అద్దెలో డిడక్ట్ కట్ చేసుకోవచ్చు. కానీ ట్విస్ట్ ఏంటంటే.. ఆ తగ్గింపు నెలకు 50% మించకూడదు. ఒకవేళ ఇల్లు అసలుండటానికే పనికిరానంతగా పాడైతే.. 15 రోజుల నోటీస్ ఇచ్చి టెనెంట్ ఖాళీ చేయవచ్చు.

టెనెంట్ ఏం చేయాలి?:
అద్దెకున్నంత మాత్రాన ఇష్టమొచ్చినట్టు ఇంటిని వాడేస్తామంటే కుదరదు. కావాలని గానీ, నిర్లక్ష్యంగా గానీ ఇంటిని పాడుచేయకూడదు. ఏదైనా డ్యామేజ్ జరిగితే వెంటనే ఓనర్‌కు లిఖితపూర్వకంగా చెప్పాలి. ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడం టెనెంట్ డ్యూటీ. ఒకవేళ టెనెంట్ చేయాల్సిన రిపేర్లు చేయకపోతే.. ఓనరే ఆ పని చేసి, ఆ ఖర్చును సెక్యూరిటీ డిపాజిట్ నుంచి కట్ చేసుకుంటారు. ఆ ఖర్చు డిపాజిట్ కంటే ఎక్కువైతే.. నోటీస్ అందిన నెల రోజుల్లో టెనెంట్ దాన్ని చెల్లించాలి.

ప్రకృతి వైపరీత్యాలు వస్తే?:
వరదలు, అగ్నిప్రమాదాలు, తుఫానుల వంటి వాటి వల్ల ఇల్లు దెబ్బతింటే సీన్ మారుతుంది. ఇల్లు మళ్లీ బాగుపడే వరకు ఓనర్ రెంట్ అడగకూడదు. ఒకవేళ ఆ ఇల్లు ఇక రిపేర్ చేయలేనంతగా పాడైపోతే.. అడ్వాన్స్ రెంట్, సెక్యూరిటీ డిపాజిట్‌ను నోటీస్ గడువు ముగిసిన 15 రోజుల్లోగా టెనెంట్‌కు ఓనర్ తిరిగి ఇచ్చేయాల్సిందేనని చట్టం చెబుతోంది. అంటే అతని చేతిలో లేని వైపరీత్యాలకు అద్దెకు ఉన్న వ్యక్తి బాధ్యత తీసుకోనక్కర్లేదన్నమాట. 

©️ VIL Media Pvt Ltd.