
Explained: ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌తో ఒప్పందం పూర్తయిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘనంగా ప్రకటించారు. దీనిని అమెరికా సాధించిన చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. కానీ, వైట్ హౌస్ వెలుపల ప్రపంచ దేశాల స్పందన, రాజకీయ వర్గాల మూడ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. అక్కడ ఎలాంటి సంబరాలు లేవు సరే కదా, కనీసం ఆశాజనకమైన వాతావరణం కూడా కనిపించడం లేదు. మీడియా రూమ్‌లు, అంతర్జాతీయ విధాన రూపకర్తలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ పరిణామంపై భిన్నమైన చర్చ నడుస్తోంది. దీనిని అమెరికా సాధించిన విజయంగా కాకుండా, రాజకీయంగా, ఆర్థికంగా, వ్యూహాత్మకంగా భరించలేని ఓ యుద్ధం నుంచి వాషింగ్టన్ తన ముఖాన్ని కాపాడుకుంటూ బయటపడేందుకు చేసిన ప్రయత్నంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇంకాస్త ఘాటుగా చెప్పాలంటే, ఇది అమెరికాకు, ముఖ్యంగా ట్రంప్‌కు ఎదురైన ఘోర పరాజయమని నిపుణులు తేల్చి చెప్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగో ప్రొఫెసర్ రాబర్ట్ ఎ. పేప్ ఈ పరిణామాన్ని ఒక “విపత్కర వ్యూహాత్మక పరాజయం”గా అభివర్ణిస్తూ, అమెరికా ఒక ఎస్కలేషన్ ట్రాప్ (ఉద్రిక్తతల ఉచ్చు) లో చిక్కుకుందని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హెచ్చరించారు.
అమెరికా ప్రతిష్టకు భంగం..
అమెరికా అధికార యంత్రాంగం ఈ ఒప్పందాన్ని విజయంగా రంగులద్దాలని చూస్తున్నా, వాస్తవ పరిస్థితులు దానికి అస్సలు సహకరించడం లేదు. వంద రోజులకు పైగా సాగిన భీకర ఘర్షణలు, బిలియన్ల కొద్దీ డాలర్ల ప్రజాధనం వృథా, సైనిక సంపత్తి నష్టం, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అంతర్జాతీయ రవాణాకు ఏర్పడిన తీవ్ర అడ్డంకులు అమెరికా ప్రతిష్టను దెబ్బతీశాయి. వీటన్నింటికీ తోడు, అమెరికాలో త్వరలో జరగబోయే మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి వాషింగ్టన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా ఇప్పుడు ఇరాన్‌పై ఆంక్షల సడలింపునకు, స్తంభింపజేసిన ఆస్తుల విడుదలకు, అలాగే ఇరాన్ పునర్నిర్మాణం కోసం భారీ ప్యాకేజీని ప్రకటించడానికి సిద్ధపడటం గమనార్హం. దీనిని టెహ్రాన్ (ఇరాన్) ఇప్పటికే తన భారీ విజయంగా ప్రపంచానికి చాటుకుంటోంది. అమెరికా బలహీనతను ఎండగడుతూ ఇటీవల ‘సిబిఎస్’ (CBS) న్యూస్ ఛానెల్‌కు చెందిన ఫేస్ ది నేషన్ కార్యక్రమంలో జర్నలిస్ట్ మార్గరెట్ బ్రెన్నాన్ చేసిన ఇంటర్వ్యూ సామాజిక మాధ్యమాల్లో దావానలంలా వ్యాపించింది. ఈ ఇంటర్వ్యూలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ మాట్లాడుతూ, తాము సైనిక ఒత్తిడి, నావికా దళాల ముట్టడి ద్వారా హార్ముజ్ జలసంధిని నిరంతరం తమ ఆధీనంలోనే ఉంచుకున్నామని చెప్పుకొచ్చారు.
తడబడ్డ రక్షణ మంత్రి..
అయితే, జర్నలిస్ట్ బ్రెన్నాన్ వెంటనే ఆయన్ను గట్టిగా నిలదీస్తూ, ఈ చర్చల్లో భాగంగా హార్ముజ్ జలసంధిని మళ్లీ తెరిపించడం కోసమే అమెరికా వారాల తరబడి తీవ్రంగా శ్రమించిందని గుర్తుచేశారు. ఒకవేళ జలసంధిపై అమెరికాకే పూర్తి నియంత్రణ ఉంటే, దానిని పునరుద్ధరించడం అనేది చర్చల్లో అంత పెద్ద ప్రధానాంశం ఎందుకు అయిందని ప్రశ్నించారు. ఈ సూటి ప్రశ్నకు రక్షణ మంత్రి హెగ్‌సెత్ సరైన సమాధానం చెప్పలేక, పదే పదే పాత మాటలనే తిప్పితిప్పి చెబుతూ కాలయాపన చేశారు. ఆయన చెప్పిన “పర్ఫార్మెన్స్ బేస్డ్ టైమ్‌లైన్స్” వంటి పదాలు ఇంటర్నెట్‌లో తీవ్రమైన ఎగతాళికి గురయ్యాయి. అమెరికా ప్రభుత్వం మాటలకు, చేతలకు అస్సలు పొంతన లేదనే విషయాన్ని ఈ ఇంటర్వ్యూ బహిర్గతం చేసింది. వాషింగ్టన్ నిజంగానే ఆ జలాలపై ఆధిపత్యం చెలాయించి ఉంటే, ఈ జలమార్గాన్ని తెరిపించడానికి ఇన్ని రోజులు ఎందుకు చర్చలు జరపాల్సి వచ్చిందనే ప్రశ్నే ఇప్పుడు అమెరికా లొంగుబాటు కథనానికి కేంద్ర బిందువుగా మారింది. కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌కు చెందిన అనుభవజ్ఞుడైన మిడిల్ ఈస్ట్ చర్చల ప్రతినిధి ఆరోన్ డేవిడ్ మిల్లర్ కూడా ఇరాన్ ఇంటర్నేషనల్ పాడ్‌కాస్ట్ ‘ఐ ఫర్ ఇరాన్’లో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ యుద్ధం పొడవునా ఇరాన్ తన ప్రాక్సీ నెట్‌వర్క్‌ల ద్వారా, ప్రపంచ ఇంధన సరఫరాను అడ్డుకోగల సామర్థ్యంతో అమెరికాపై గట్టి పట్టు సాధించిందని ఆయన విశ్లేషించారు. మరికొందరు రాజకీయ నేతలు దీనిపై ఇంకా ఘాటుగా స్పందించారు. డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు సెత్ మౌల్టన్ ‘ఎమ్ఎస్ నౌ’ (MS NOW) ఛానెల్‌తో మాట్లాడుతూ, ఈ ఒప్పందం మరేదో కాదు, డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఇరాన్ సుప్రీం లీడర్‌కు సమర్పించుకున్న “లొంగుబాటు పత్రం” అని ఎద్దేవా చేశారు. ట్రంప్ మాత్రం తన సైనిక ఒత్తిడి వ్యూహం వల్లే ఇరాన్ లొంగివచ్చిందని, హార్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని, ఈ ఒప్పందం వల్ల ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా అడ్డుకున్నామని సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకుంటున్నారు.
ట్రంప్‌పై రాజకీయ ఒత్తిడి
కానీ ఈ ఒప్పందం లోపలి వివరాలు చూస్తే అసలు కథ వేరేలా ఉంది. కీలకమైన అణు వివాదాలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు, వాటిని మరో 60 రోజుల చర్చల విండోలోకి నెట్టేశారు. ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షల ఎత్తివేతతో పాటు, యుద్ధంలో దెబ్బతిన్న ఇరాన్ మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం కోసం దాదాపు 300 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి ప్యాకేజీపై కూడా ఈ ఒప్పందంలో చర్చలు జరిగాయి. దీనిని ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ ‘మెహర్ న్యూస్’ అమెరికా చెల్లించబోయే యుద్ధ నష్టపరిహారంగా అభివర్ణించింది. అయితే ది న్యూయార్క్ టైమ్స్ వంటి పాశ్చాత్య మీడియా సంస్థలు దీనిని అంతర్జాతీయ ప్రైవేట్ పెట్టుబడిగా పేర్కొంటూ, ఇందులో జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్‌కాఫ్ వంటి ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయని రాశాయి. ట్రంప్ మాత్రం ముందస్తుగా ఎలాంటి నగదు చేతులు మారడం లేదని నొక్కి చెబుతున్నా, ప్రభుత్వ ప్రకటనలకు, లీక్ అవుతున్న ఒప్పంద నిబంధనలకు మధ్య ఉన్న తేడా ప్రజల్లో అనుమానాలను మరింత పెంచుతోంది. ఈ వివాదం అంతా ఫిబ్రవరి 28న ఇరాన్ అణు సామర్థ్యాలను దెబ్బతీయడానికి, ఆ ప్రాంతంలో దాని ప్రభావాన్ని తగ్గించడానికి అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడులతో ప్రారంభమైంది. అయితే ట్రంప్ ఊహించినట్లుగా ఇది సులభంగా ముగిసిపోలేదు. నావికా దళాల ముట్టడి, ప్రపంచ ఇంధన మార్కెట్లో సంక్షోభం, రవాణా నౌకలపై దాడులతో యుద్ధం సుదీర్ఘంగా సాగింది. మే మధ్య నాటికి ఈ యుద్ధం కోసం పెంటగాన్ దాదాపు 25 నుండి 29 బిలియన్ డాలర్ల ప్రత్యక్ష సైనిక వ్యయాన్ని భరించాల్సి వచ్చింది. దీనికి తోడు, తటస్థంగా ఉన్న వాణిజ్య నౌకలపై జరిగిన క్షిపణి దాడుల్లో ముగ్గురు భారతీయ సిబ్బంది మరణించడం అంతర్జాతీయంగా అమెరికా వ్యూహంపై తీవ్ర విమర్శలకు దారితీసింది. స్వదేశంలో కూడా ట్రంప్‌పై రాజకీయ ఒత్తిడి తీవ్రమైంది. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు సమీపిస్తుండటం, అంతర్జాతీయంగానే కాకుండా అమెరికా దేశీయ మార్కెట్లో కూడా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడం ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా పెద్ద మైనస్‌గా మారింది.
మరోవైపు జూలై 4న అమెరికా తన 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఇంతటి చారిత్రాత్మకమైన సందర్భంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాటలు విని తానే స్వయంగా మొదలుపెట్టిన ఒక అసంపూర్ణ యుద్ధం నీడ దేశంపై పడటం ట్రంప్‌కు ఇష్టం లేదు. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తోందంటూ నెతన్యాహు గత పాతికేళ్లుగా చేస్తున్న ప్రచారాన్ని నమ్మి ట్రంప్ ఈ యుద్ధానికి దిగారనే విమర్శలు ఉన్నాయి. డెమోక్రాట్లు, ట్రంప్ వ్యతిరేకులు ఈ యుద్ధాన్ని అమెరికా ప్రతిష్టను దిగజార్చిన ఒక అనవసరపు వ్యవహారంగా చిత్రీకరిస్తున్నారు. మరోవైపు.. ఈ ఒప్పందం భవిష్యత్తులో నిలబడుతుందా అనేదానిపై కూడా సందేహాలు ఉన్నాయి. లెబనాన్‌లోని హెజ్బొల్లాతో ఉన్న ఉద్రిక్తతలు ఈ తాత్కాలిక శాంతిని ఎప్పుడైనా చెడగొట్టవచ్చని నిపుణుడు ఆరోన్ డేవిడ్ మిల్లర్ హెచ్చరిస్తున్నారు. ఇటు ఇజ్రాయెల్‌లో కూడా ఈ ఒప్పందంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్ జర్నలిస్ట్ గిడియాన్ లెవీ దీనిని ఇజ్రాయెల్ పరాజయంగా, నెతన్యాహు వ్యక్తిగత ఓటమిగా వర్ణించారు. అలాగే మాజీ అమెరికా ప్రత్యేక ప్రతినిధి ఇలియట్ అబ్రామ్స్ మాట్లాడుతూ, ఇరాన్‌లో ప్రస్తుత పాలన అంతమైతేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. ట్రంప్ మద్దతుదారులు మాత్రం ఒక పెద్ద ప్రాంతీయ యుద్ధాన్ని నివారించడమే తాము సాధించిన వ్యూహాత్మక విజయమని సమర్థించుకుంటున్నారు. కానీ, అంతర్జాతీయ రాజకీయాల్లో కనిపించే దృశ్యాలే ముఖ్యం. ప్రస్తుతం ప్రపంచం దృష్టిలో అమెరికా ఒక సూపర్ పవర్ హోదాను కోల్పోయి, ఇరాన్ నిబంధనలకు తలవంచి ఒప్పందం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. అమెరికా రక్షణ మంత్రి టీవీ ఇంటర్వ్యూలో సమాధానం చెప్పలేక తడబడిన ఆ వీడియో క్లిప్పే, ఓటమిని విజయంగా రంగులు మార్చాలని చూసిన అమెరికా విఫల యుద్ధానికి సజీవ సాక్ష్యంగా మిగిలిపోయింది.