
- 6.20 ఎకరాల భూసేకరణకు సర్కారు అనుమతి
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో రహదారి విస్తరణ పనులకు మున్సిపల్ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంచిరేవుల, నార్సింగి గ్రామాల పరిధిలో రోడ్డు వెడల్పు కోసం 6.20 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రోటరీ క్లబ్ నుంచి అల్కాపూర్ టౌన్‌షిప్ రోడ్డు వరకు ఉన్న ప్రస్తుత రహదారిని విస్తరించడానికి మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.అయితే, గతంలో హెచ్ఎండీఏ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం.. భూసేకరణ రికార్డులను పరిశీలించగా ఒక చిన్న పొరపాటు వెలుగుచూసింది.
మంచిరేవుల గ్రామానికి చెందిన కొన్ని భూముల సర్వే నంబర్లను పొరపాటున నార్సింగి గ్రామం కింద చూపించారు. ఈ తప్పును అధికారులు సరిదిద్ది, ఏ భూమి ఏ గ్రామానికి చెందుతుందో స్పష్టం చేస్తూ సవరించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. కొత్త ప్రతిపాదన ప్రకారం మంచిరేవుల, నార్సింగి గ్రామాల్లో కలిపి మొత్తం 6 ఎకరాల 20 గుంటల భూమిని సేకరించనున్నారు. దీని కోసం చట్ట ప్రకారం తదుపరి నోటిఫికేషన్‌ను ల్యాండ్ అక్విజిషన్ అధికారి జారీ చేయనున్నారు. ట్రాఫిక్ సమస్యలను తీర్చడానికి రోడ్డు విస్తరణ ప్రాజెక్టు అత్యంత అవసరమని భావించిన ప్రభుత్వం, భూసేకరణ ప్రతిపాదనలకు తుది ఆమోదం తెలిపింది.–