Reading Time: 2 minutes

అణు ప్రమాదం రేడియేషన్‌ను గెలిచిన తోడేళ్లు.. చెర్నోబిల్ అడవుల్లో సైంటిస్టుల షాకింగ్ రీసెర్చ్

Caption of Image.

చెర్నోబిల్.. ఈ పేరు వినగానే గుర్తొచ్చేది దశాబ్దాల క్రితం జరిగిన ఒక ఘోరమైన అణు ప్రమాదం. ప్రస్తుతం ఆ ప్రాంతం సీన్ పూర్తిగా మారిపోయింది. మనుషులు ఖాళీ చేసి వెళ్లిన ఆ ప్రాంతం.. ఇప్పుడు వన్యప్రాణులకు అద్భుతమైన నేచురల్ ల్యాబొరేటరీగా మారిపోయింది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత.. రేడియేషన్ గుప్పిట్లో ఉన్న ఆ భూమిపై ప్రకృతి ఎలా జెండా పాతేసిందో, జంతువులు ఎలా సామ్రాజ్యాన్ని స్థాపించాయో తెలుసుకుందాం..

మనుషులు అవుట్.. ప్రకృతి ఇన్
1986లో అణు రియాక్టర్ పేలిపోవడంతో రాత్రికి రాత్రే వేలాది మంది జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లు వదిలి పారిపోయారు. మనుషుల అడుగుజాడలు ఒక్కసారిగా చెరిగిపోవడంతో.. అక్కడ సరిహద్దులు లేని ప్రకృతి రాజ్యం మొదలైంది. పొలాలు అడవులుగా మారాయి. రోడ్ల మధ్య నుండి చెట్లు మొలిచాయి. వేటగాళ్ల భయం, వాహనాల శబ్దాలు లేకపోవడంతో.. అక్కడ జంతువులు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నాయి. ఎలాంటి ప్లాన్ లేకుండానే ప్రకృతి తన గాయాలను తనే నయం చేసుకోవడం స్టార్ట్ చేసింది.

తోడేళ్ల సామ్రాజ్యం.. కింగ్ సైజ్ లైఫ్
ఈ అడవిలో అన్నిటికంటే ఎక్కువగా ‘గ్రే తోడేళ్లు’ హైలైట్ అయ్యాయి. మనుషుల అలజడి లేకపోవడంతో వీటి సంఖ్య మునుపటి కంటే విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు మనుషులకు భయపడి దాక్కున్న తోడేళ్లు.. ఇప్పుడు పాడుబడిన ఇళ్లు, నిర్మానుష్య రోడ్లపై రాజుల్లా తిరుగుతున్నాయి. వాటి వేట సామ్రాజ్యం విస్తరించింది. విచిత్రం ఏంటంటే.. ఇవి రేడియేషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 

రేడియేషన్ వర్సెస్ తోడేళ్ల జీన్స్
మనుషులకు ప్రాణాంతకమైన రేడియేషన్ జోన్లలో ఈ తోడేళ్లు ఎలా బతుకుతున్నాయి? సైంటిస్టులు వీటి మెడకు కాలర్లు కట్టి రీసెర్చ్ చేస్తే షాకింగ్ విషయాలు తెలిశాయి. మనుషులకు అనుమతించిన దానికంటే వందల రెట్లు ఎక్కువ రేడియేషన్‌ను ఇవి రోజూ ఎదుర్కొంటున్నాయి. అయినా వీటి పాపులేషన్ తగ్గలేదు సరే కదా.. సక్సెస్‌ఫుల్‌గా పిల్లల్ని కంటున్నాయి. వీటి బ్లడ్ శాంపిల్స్ పరిశీలించగా.. క్యాన్సర్‌ను తట్టుకునేలా, ఇమ్యూనిటీని పెంచేలా వీటి శరీరంలోని వేలాది జీన్స్‌లో మార్పులు వచ్చినట్లు సైంటిస్టులు గుర్తించారు. తరతరాలుగా రేడియేషన్ మధ్యే బతుకుతుండటంతో వీటి శరీరం ఒక వింతైన జీవన పోరాటానికి అలవాటు పడిందట.

మిగతా జంతువుల పరిస్థితి ఏంటి?
తోడేళ్లతో పాటు అడవి పందులు, జింకలు, దుప్పి వంటి పెద్ద జంతువులు కూడా అక్కడ హ్యాపీగానే తిరుగుతున్నాయి. మనుషులు లేకపోవడమే వీటికి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. అయితే కథ అంతా పాజిటివ్‌గా మాత్రమే లేదు. పెద్ద జంతువులు రేడియేషన్‌ను తట్టుకోగలుగుతున్నా.. చిన్న పక్షులు, కీటకాలు మాత్రం ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని పక్షుల్లో సంతానోత్పత్తి సమస్యలు, శారీరక లోపాలు కనిపిస్తున్నాయని సైంటిస్టులు గుర్తించారు.

చెర్నోబిల్ జోన్ మనకు ఒక విషయాన్ని స్పష్టంగా చూపిస్తోంది. మనుషులు ప్రకృతిని ఎంత పాడు చేసినా, మనుషులు లేని చోట ప్రకృతి మళ్లీ తనదైన శైలిలో ప్రాణం పోసుకోగలదని ఇది నిరూపించింది. కాకపోతే ఈ రికవరీ అందరికీ ఒకేలా లేదు.. కొన్ని జీవులకు అది శాపమైతే, తోడేళ్ల లాంటి మరికొన్ని జీవులకు అది సరికొత్త సామ్రాజ్యంగా మారటం సైన్స్ పరిధి దాటి ఆలోచింపజేస్తోంది.

©️ VIL Media Pvt Ltd.