
హైదరాబాద్, జూన్ 17: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 9 నుంచి 10 రాష్ర్టాలపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని, ఆయా రాష్ర్టాల్లోని జిల్లా అధికారులు, వ్యవసాయ సంస్థలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాల కోసం ముందస్తు అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేయటం, పత్తి, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచటం, రైతులకు శాస్త్రీయ సలహాలు అందేలా చూడటంపై దృష్టి సారించాలని ఆయన అన్నారు. వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాల్లో ముందస్తు అత్యవసర ప్రణాళికల ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.
రైతుల్లో భయాందోళనలు కలిగించొద్దు.. దారి చూపండి
రాష్ట్ర వ్యవసాయ శాఖలు, జిల్లా అధికారులు, కృషి విజ్ఞాన్ కేంద్రాలు, విస్తరణ సంస్థలు సన్నిహితంగా సమన్వయం చేసుకుని, జిల్లా స్థాయిలో సంయుక్త సమావేశాలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. రైతుల్లో భయాందోళనలు సృష్టించడం ప్రభుత్వ లక్ష్యం కాదని, వారికి కచ్చితమైన, శాస్త్రీయ ఆధారిత సలహాలు అందేలా చూడటమే ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. రైతులకు భయపెట్టే సందేశాలు కాకుండా విశ్వసనీయమైన సమాచారం ఇవ్వాలని, అలాగే ఆ సమాచార ప్రసారం శాస్త్రీయ విశ్లేషణపై ఆధారపడి ఉండాలని ఆయన అన్నారు. ప్రతి సున్నితమైన జిల్లాకు నీటి సంరక్షణ, నేల తేమ నిర్వహణ, అంతర పంటలు, ప్రత్యామ్నాయ పంటల సరళిపై దృష్టి సారించేలా ప్రత్యేక వ్యూహాలను రూపొందించాలని అన్నారు.
పత్తి, పప్పుధాన్యాల సాగుపై దృష్టి పెట్టండి
ఈ సమీక్షా సమావేశంలో ఖరీఫ్ సీజన్ కోసం పంటల వారీ లక్ష్యాలు, విత్తనాలు వేసే పురోగతి, రాష్ట్రాల వారీ సన్నద్ధతను కూడా అంచనా వేశారు. ఈ ఏడాది పత్తి, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని, ఉత్పత్తిని పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించారు. మెరుగైన విత్తన ఎంపిక, మల్చింగ్ పద్ధతులు, తేమ పరిరక్షణ చర్యల ద్వారా పత్తి ఉత్పాదకతను మెరుగుపరచాలని ప్రభుత్వం నొక్కి చెప్పింది. పప్పుధాన్యాల దిగుమతులపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడానికి, మెరుగైన విత్తనాల లభ్యత, పంట మార్పిడి, సాంకేతిక మార్గదర్శకత్వం ద్వారా కంది, మినుములు, పెసర వంటి పంటల సాగును విస్తరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా జలాశయాల మట్టాలు, పంట ధరలు, ఎరువుల లభ్యతను సమీక్షించింది. దేశవ్యాప్తంగా తగినంత ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి చౌహన్ తెలిపారు. రుతుపవనాల పురోగతి సమయంలో స్థానికంగా కొరత ఏర్పడే అవకాశం ఉన్న మారుమూల ప్రాంతాలకు కూడా ఎరువుల ముందస్తు సరఫరా అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.
పరిశోధనలు ల్యాబ్‌లకే పరిమితం చేయొద్దు.. రైతులకు చేరాలి
వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఐసీఏఆర్ సంస్థలు, కృషి విజ్ఞాన్ కేంద్రాలు, రాష్ట్ర వ్యవసాయ శాఖల మధ్య మరింత బలమైన సమన్వయం అవసరమని అన్నారు. వ్యవసాయ పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞానం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా సకాలంలో నేరుగా క్షేత్రస్థాయిలోని రైతులకు చేరాలని ఆయన అన్నారు. విజయవంతమైన, సురక్షితమైన ఖరీఫ్ సీజన్‌ను నిర్ధారించడానికి నిరంతర పర్యవేక్షణ, క్రమమైన సమీక్ష, రైతుల నుండి స్థిరమైన అభిప్రాయ సేకరణ జరగాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.