
The India Story : ప్రతిరోజూ మనం తినే ఆహారం నిజంగా సురక్షితమేనా? మార్కెట్‌లో కొనుగోలు చేసే కూరగాయలు, పండ్లు, నిత్యావసర వస్తువుల వెనుక కనిపించని ప్రమాదం ఎంత ఉంది ? ఆహార కల్తీ అనే సమస్య మన ఆరోగ్యంపై ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతుందో చెప్పే ప్రయత్నాలు అప్పుడప్పుడు వార్తల్లో కనిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు అదే అంశాన్ని ఒక కోర్టు డ్రామా రూపంలో వెండితెరపైకి తీసుకురాబోతున్న చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. తాజాగా విడుదలైన ఈ సినిమా పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది. పోస్టర్ లోనే చాలా స్టోరీ కనిస్తోంది. జీ స్టూడియోస్, ఎంఐజి ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. పోస్టర్‌ను పరిశీలిస్తే ఆమె ఒక ధైర్యవంతమైన న్యాయవాదిగా కోర్టులో పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ప్రముఖ నటుడు శ్రేయాస్ తల్పడే ఒక బాధతో కుంగిపోయిన తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన పక్కన ఒక చిన్నారి ఉండటం, కుటుంబాన్ని తాకే విషాదం ఈ కథలో ప్రధానంగా ఉండబోతోందనే సంకేతాన్ని ఇస్తోంది.
ఈ పోస్టర్‌లో మరో ప్రత్యేక ఆకర్షణ బాంబే హైకోర్టు నేపథ్యం. కోర్టు బోనులో ఉంచిన పురుగుమందు సిలిండర్ ను చూస్తే కథ ఎంత సోషల్ గా ఉంటుందో తెలుస్తోంది. ఆహార కల్తీ కారణంగా ప్రజలు ఎదుర్కొనే విషాదాలను న్యాయపరమైన కోణంలో ఈ సినిమా చూపించబోతోందని పోస్టర్ ద్వారానే స్పష్టమవుతోంది. ఇక ఈ చిత్రానికి చెట్టన్ డి.కె. దర్శకత్వం వహిస్తుండగా, కథను సాగర్ బి. షిండే రచించి నిర్మిస్తున్నారు. ఇప్పటికే 2026 జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జీ స్టూడియోస్ ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల చేయనుండటం విశేషం. ఆహార కల్తీ అనేది ఒక నేరం మాత్రమే కాదు, అది ప్రజారోగ్యానికి సంబంధించిన అత్యంత కీలకమైన సమస్య. నాసిరకం ఆహారం, కల్తీ పదార్థాలు, రసాయనాల వినియోగం వంటి అంశాలు అనేక కుటుంబాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నప్పటికీ, ఈ సమస్యపై పెద్దగా చర్చ జరగడం అరుదుగా కనిపిస్తుంది. అలాంటి సామాజిక సమస్యను కోర్టు డ్రామాతో ప్రేక్షకులను ఆలోచింపజేసే ప్రయత్నమే ‘ది ఇండియా స్టోరీ’ ప్రత్యేకతగా కనిపిస్తోంది.