Reading Time: < 1 minute
Kriti Sanon Comments On Gender Discrimination In Cinema

సినీ పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లు సమానంగా కష్టపడుతున్నప్పటికీ పారితోషికం, గౌరవం విషయంలో ఇంకా భారీ తేడా కొనసాగుతోందని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన కృతి, టాలీవుడ్‌లో మహేశ్ బాబు సరసన ‘1 నేనొక్కడినే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తర్వాత బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా విజయవంతంగా రాణిస్తున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కృతి, సినిమా బడ్జెట్‌లో ఎక్కువ భాగం హీరోలకే వెళ్తుందని, ఖర్చులు తగ్గించాల్సి వస్తే ముందుగా హీరోయిన్ల పారితోషికాలపైనే కోతలు వేస్తారని అన్నారు. షూటింగ్ సమయంలో కూడా చిన్న చిన్న విషయాల్లో వివక్ష కనిపిస్తుందని, హీరోలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారని చెప్పారు. కెరీర్ ప్రారంభంలో తన స్థాయి హీరోకు లగ్జరీ కార్ పంపించి, తనకు మాత్రం సాధారణ వాహనం ఇచ్చిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. సినీ పరిశ్రమలో స్టార్ కిడ్స్ హవా ఇంకా బలంగా ఉందని, దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని కృతి పేర్కొన్నారు. సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడంతో ఎన్నో అవకాశాలు స్టార్ కిడ్స్‌కు వెళ్లిపోయాయని, తాను కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.