Reading Time: 3 minutes
India Womens Archery Team Wins Gold At Archery World Cup 2026 After Beating China

India Women’s Archery Team Wins Gold at Archery World Cup 2026: షాంఘైలో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-2లో భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. దీపికా కుమారి, అంకిత భకత్, కుంకుమ్ మొహోద్‌ సభ్యురాళ్లతో ఉన్న భారత జట్టు ఫైనల్లో ఆతిథ్య చైనా జట్టును ఉత్కంఠభరిత షూట్-ఆఫ్‌ లో 5-4 తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. నాలుగు సెట్ల ముగిసే సమయానికి స్కోరు 4-4తో సమంగా నిలవడంతో మ్యాచ్ షూట్-ఆఫ్‌కు వెళ్లింది. ఈ కీలక సమయంలో ఒత్తిడిని జయించి భారత ఆర్చర్లు అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్ సాధించారు.

ఈ విజయం మరింత ప్రత్యేకత ఏమిటంటే.. సెమీఫైనల్లో భారత జట్టు 10 సార్లు ఒలింపిక్ ఛాంపియన్ అయిన దక్షిణ కొరియాను ఓడించడం. 2021 తర్వాత మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి వరల్డ్ కప్ స్వర్ణ పతకం కావడం విశేషం. అలాగే మూడు సంవత్సరాల తర్వాత ఈ విభాగంలో భారత్‌కు వచ్చిన తొలి పతకం ఇది. అనుభవజ్ఞురాలైన దీపికా కుమారి మొత్తం టోర్నీలో కీలక పాత్ర పోషించింది. పూర్తి స్థాయి జాతీయ కోచ్ లేకుండానే పోటీలకు వెళ్లిన భారత జట్టుకు ఆమె నిరంతరం మార్గనిర్దేశనం చేస్తూ యువ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపింది.

మ్యాచ్ ఆరంభంలో భారత్ 54-53తో తొలి సెట్ గెలిచి ఆధిక్యం సాధించింది. దీపికా వరుసగా 10 పాయింట్లు సాధిస్తూ జట్టుకు లీడ్ తెచ్చింది. అయితే రెండో సెట్లో భారత్ తడబడింది. కుంకుమ్ ఒక 8 మాత్రమే సాధించగా, దీపికా చివరి బాణంలో 7 కొట్టడంతో చైనా 2-2తో సమం చేసింది. మూడో సెట్లో చైనా ఆధిపత్యం చాటింది. వారి చివరి బాణాన్ని రివ్యూలో 8 నుంచి 9గా అప్‌గ్రేడ్ చేయడంతో చైనా 4-2 ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో భారత్ ఓటమి అంచున కనిపించింది.

అయితే నాలుగో సెట్లో దీపికా మళ్లీ తన ఫామ్ అందుకుంది. రెండు పర్ఫెక్ట్ 10లతో భారత్‌ను పోటీలోకి నిలబెట్టింది. టైటిల్ గెలవడానికి హోస్ట్ కంట్రీ చైనాకు చివరి బాణంలో 9 మాత్రమే అవసరమైంది. కానీ ఒత్తిడిలో చైనా ఆర్చర్ యూ కీ 8 మాత్రమే కొట్టడంతో మ్యాచ్ షూట్-ఆఫ్‌కు వెళ్లింది. ఇక అంతే షూట్-ఆఫ్‌లో భారత ఆటగాళ్లు అద్భుత ఆట ఆడారు. అంకిత భకత్ 9తో ప్రారంభించగా, కుంకుమ్ మొహోద్ 10 సాధించింది. చివరగా భారత్‌కు గోల్డ్ ఖాయం కావడానికి 8 అవసరమైన సమయంలో దీపికా 9 కొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.