Reading Time: 2 minutes
Varun Chakaravarthy Gets Emotional After Kkrs First Ipl 2026 Win Reveals Dressing Room Scenes

ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్) ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆదివారం ఈడెన్‌ గార్డెన్స్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఈ సీజన్‌లో మొదటి విజయాన్ని అందుకుంది. ఆరు మ్యాచ్‌ల్లో ఐదు ఓడి (ఓ మ్యాచ్‌ రద్దు) పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న కేకేఆర్‌.. చివరికి ఏడో మ్యాచ్‌లో గెలుపు రుచి చూసింది. దాంతో కోల్‌కతా ప్లేయర్స్ భావోద్వేగం చెందారు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ప్రతిఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారని మిస్టరీ స్పిన్నర్ వరుణ్‌ చక్రవర్తి వెల్లడించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌’గా నిలిచిన చక్రవర్తి.. జట్టు విజయంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. గత కొన్ని వారాలుగా జట్టుకు ఎదురైన కష్టాలను గుర్తు చేస్తూ.. ఈ విజయం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోందని తెలిపాడు.

‘చాలా సంతోషంగా ఉంది. నా గురించి మాట్లాడే ముందు మొత్తం కోచింగ్ స్టాఫ్‌కు క్రెడిట్ ఇవ్వాలి. గత కొన్ని వారాలు మాకు కఠినంగా గడిచాయి. మాకు విజయాలు లేవు. బయట చాలా విమర్శలు వచ్చాయి. కానీ హెడ్ కోచ్, ఇతర కోచ్‌లు మా మీద ప్రభావం చూపకుండా చూసుకున్నారు. మేమంతా మా ప్రాసెస్‌పైనే దృష్టి పెట్టాము. అందుకే ఈ విజయానికి అందరం అర్హులమే. ఇది ఒక్క విజయం అయినా కూడా చాలా బాగా అనిపిస్తోంది. మా డ్రెస్సింగ్‌రూమ్‌లో అందరి కన్నీళ్లను చూశా. పదేళ్ల తర్వాత 2024లో మూడోసారి ఛాంపియన్‌గా నిలిచాం. అప్పుడు కూడా ఇలాంటి దృశ్యాలను చూడలేదు. ఇప్పుడు అందరూ భావోద్వేగం చెందారు’ అని వరుణ్‌ చక్రవర్తి చెప్పాడు.

‘ఈరోజు ఏమి ప్రత్యేకం లేదు. ఐపీఎల్‌లో పిచ్‌లు ఎలా ఉంటున్నాయో అలానే ఉంది. ఈరోజు పిచ్ కొంచెం స్లోగా ఉంది. అది మాకు అనుకూలించింది. ప్రారంభంలో కొన్ని మ్యాచ్‌లు నేను ఆడలేదు. నాకు గాయం అయ్యింది. నా ఎడమ చేతిలో రెండు ఫ్రాక్చర్లు ఉన్నాయి. వాటిని మేనేజ్ చేస్తూ ఆడుతున్నాను. కాస్త కష్టం అవుతోంది కానీ సాధ్యమైనంతవరకు మంచి ప్రదర్శన ఇవ్వడానికి చూస్తున్నా. పిచ్ కొంచెం నెమ్మదిగా ఉన్నా.. మా ఆటకు సరిపోయింది. మధ్య ఓవర్లలో బ్యాటింగ్ ఇంకాస్త బాగా చేయవచ్చు అనిపిస్తోంది. మొత్తానికి సంతృప్తిగా ఉంది’ అని చక్రవర్తి తెలిపాడు.

‘టోర్నీని ఎక్కడ ముగుస్తామో ఇప్పుడే చెప్పలేం. కానీ మేము పోటీకి వచ్చాం. కేవలం పాల్గొనడానికి కాదు, ప్రతి మ్యాచ్ గెలవడమే మా లక్ష్యం. ట్రోఫీ కోసం బలమైన పోటీదారులమని నిరూపించుకోవాలని చూస్తున్నాం. మాకు ఇంకా ఆశలు ఉన్నాయి. ఇకపై మేము మరింత బాగా ఆడుతాం’ అని చక్రవర్తి చెప్పుకొచ్చాడు. సీజన్ ప్రారంభానికి ముందే హర్షిత్ రాణా, ఆకాశ్‌ దీప్‌ గాయాలతో దూరమయ్యారు. మతీశా పతిరన ఇప్పుడే జట్టులో చేరాడు. సరైన బౌలింగ్ లేకపోవడం కోల్‌కతాపై ప్రభావం చూపుతోంది.