Reading Time: < 1 minute
Chicken Price Today: నాన్ వెజ్ ప్రియులకు షాక్.. కోడి గుడ్డుతో సరిపెట్టుకుంటున్న సామాన్యుడు!

హైదరాబాద్‌, మార్చి 22: ఆదివారం వచ్చిందంటే జంట నగరాల్లో చికెన్‌ ఘుమఘుమలు ముక్కుపుటాలను ఎగురవేస్తాయి. అయితే ఈ రోజు మాత్రం ఎక్కడ చూసినా చికెన్ షాపులు వెలవెల పోతున్నాయి. రంజాన్ మాసం కారణంగా గత నెల రోజులుగా చికెన్ వినియోగం భారీగా పెరిగింది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్‌ కలిసి రావడం, ఎండల కారణంగా చికెన్‌ వినియోగం సహజంగానే అధికమైంది. ఈ కారణాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో చికెన్‌ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం కిలో చికెన్‌ ధర రూ.350 నుంచి రూ.400 వరకు పలుకుతుంది. ఇక నాటుకోడి అయితే కిలో ఏకంగా రూ.800 పెరిగింది. మటన్‌తో పోటీపడుతు చికెన్‌ ధరలు ఆకాశానికి ఎగబాకడంతో సామాన్యులు కొనలేక లబోదిబోమంటున్నారు.

ఈ రోజు ఆదివారం అయినప్పటికీ చికెన్‌ ధరలతో బెంబేలెత్తి పోతున్న జనాలు గుడ్డుతో సరిపెట్టుకుంటున్నారు. ముఖ్యంగా పండుగల సీజన్, వేసవి ప్రభావం కలిసి రావడంతో ఒక్కసారిగా రూ.70 నుంచి 80 అమాంతం పెరిగింది. వారం క్రితం కిలో రూ.330 వరకు లభించిన స్కిన్‌లెస్ చికెన్, దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో రూ.380 నుంచి రూ.400 పలుకుతుంది. హైదరాబాద్‌లో చాలా చోట్ల కూడా రూ.380 నుంచి రూ. 400గా కొనసాగుతున్నాయి. ధరల పెరుగుదలకు ప్రధాన కారణం డిమాండ్ సప్లై అసమతుల్యత అని వ్యాపారులు అంటున్నారు. వేసవి ఎండల తీవ్రత కారణంగా పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు మరణిస్తున్నాయని, సప్లైకి ఇదీ ఒక కారణమేనని వ్యాపారులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు కోళ్ల పెంపకంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. గతంలో పెద్ద ఎత్తున కోళ్ల పెంపకం జరిగినా వేసవిలో గణనీయంగా తగ్గిస్తున్నారు.

ఇదే బాటలో మటన్ ధరలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. నెల క్రితం వరకు కిల మటన్‌ రూ.800 ఉండగా.. ప్రస్తుతం రూ.1000 వరకు చేరుకుంది. పెరిగిన ధరలతో మాంసాహార ప్రియులు చేపలు, రొయ్యలు వంటి ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. వేసవి తీవ్రత తగ్గేవరకు చికెన్‌ ధరల పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే విజయవాడలో వ్యాపారులు దారుణంగా చికెన్‌ ధరలు పెంచారు. ఏకంగా రూ.100 పెంచి కిలో రూ.400కిపైగా విక్రయిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.