Reading Time: 2 minutes
Ipl 2026 Australian Fast Bowlers Injuries Starc Cummins Hazlewood Impact

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరగనుంది. మొత్తం 10 జట్లు ఐపీఎల్ కోసం సన్నద్ధమవుతుండగా ఆస్ట్రేలియా పేస్ బౌలర్ల బృందం గందరగోళానికి గురి చేస్తోంది. ఈ స్టార్ బౌలర్లు ఒక్కొక్కరిగా గాయాలతో దూరమవుతున్నారు. ఐపీఎల్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు, ఏకంగా నలుగురు ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్లు జట్టులో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించారు. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ టోర్నమెంట్ దూరమవుతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. జోష్ హేజిల్‌వుడ్ తొడ కండరాల గాయం (హ్యామ్‌స్ట్రింగ్), అకిలెస్ టెండినైటిస్ (మడమ స్నాయువు వాపు)తో పోరాడుతున్నాడు. మిచెల్ స్టార్క్ ఇటీవల టెస్ట్ క్రికెట్ ఆడాడు. ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను క్రమంగా పునరాగమనం కోసం సిద్ధం చేస్తున్నారు. అయితే.. క్రికెట్ ఆస్ట్రేలియా (CA) తన కీలక ఫాస్ట్ బౌలర్ల విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సుముఖంగా లేదు. ఎందుకంటే రాబోయే 12 నెలల్లో ఈ జట్టుకు సుమారు 21 టెస్ట్ మ్యాచ్‌లు షెడ్యూల్ చేయబడ్డాయి. భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అంతేకాదు.. 2027 వన్డే ప్రపంచ కప్ కోసం సన్నాహాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.

READ MORE: IPL 2026 Records: మెయిడెన్ ఓవర్ల మాయాజాలం.. ఐపీఎల్‌లో మొత్తం మనోళ్లదే హవా!

ఈ ఎఫెక్ట్ ముందుగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై పడనుంది. టీమ్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ దూరమవుతుండటంతో ఇషాన్ కిషన్‌కు పగ్గాలు అప్పగించారు. కెప్టెన్ పాట్ కమిన్స్ లేకపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ బలహీనపడింది. మరోవైపు, జోష్ హేజిల్‌వుడ్ లేకపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ బౌలింగ్ కూర్పును సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రారంభ మ్యాచ్‌లలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్టుకు మిచెల్ స్టార్క్ లేని లోటు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక నాథన్ ఎల్లిస్ లేకపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఇది అతిపెద్ద దెబ్బగా మారింది. టీ20 ప్రపంచ కప్‌కు ముందు అతనికి తగిలిన హామ్‌స్ట్రింగ్ గాయమైంది. ఇటీవల హోబర్ట్‌లో జరిగిన వన్డే కప్ ఫైనల్ సమయంలో ఈ గాయం మరింత తీవ్రమైంది. దీంతో జట్టుకు దూరమయ్యాడు. ఇక మిచెల్ స్టార్క్ , పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్‌ల పునరాగమనం ఫిట్‌నెస్ పురోగతిపై ఆధారపడి ఉంటుంది. అంతా సవ్యంగా సాగితే, ఈ ఆటగాళ్లు టోర్నమెంట్ మధ్యలో జట్టులో చేరవచ్చు. అయితే, తొలి మ్యాచ్‌లలో ఈ బౌలర్లు లేని లోటు మాత్రం పక్కా కనిపిస్తుంది.