July 10, 2026

Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Reading Time: < 1 minute
Suryakumar Yadav Reveals Emotional Story Behind His Fixed Seat In Mumbai Indians Dressing Room

భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన క్రికెట్ కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన ఒక ఆసక్తికర అనుభవాన్ని ఇటీవల వెల్లడించాడు. ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో తొలిసారి అడుగుపెట్టిన రోజు జరిగిన సంఘటన తన జీవితంలో ప్రత్యేకమైన జ్ఞాపకంగా మిగిలిపోయిందని చెప్పాడు. తాను మొదటిసారి ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లినప్పుడు కూర్చోవడానికి కూడా స్థలం లేదని గుర్తుచేసుకున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్ తనకు కూర్చోవడానికి స్థలం ఇచ్చారని, ఆ స్థలమే తనకు ఫిక్స్ అయిపోయిందని సూర్య చెప్పుకొచ్చాడు.

‘నేను మొదటిసారి ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లినప్పుడు కూర్చోవడానికి ఎక్కడా స్థలం లేదు. చాలా మంది ఆటగాళ్లు అక్కడ ఉన్నారు. నేను నా కిట్ బ్యాగ్‌తో నిలబడి ఉన్నాను. అప్పటికి క్రికెట్ గాడ్ సచిన్ టెండ్యూలర్ గణేశ్‌జీ విగ్రహం ఉన్న దగ్గర ఒక చోట కూర్చునేవారు. అప్పుడు నన్ను చూసి ఏమైంది? అని అడిగారు. నేను కూర్చోవడానికి స్థలం లేదు అని చెప్పాను. అప్పుడు ఆయన ఎక్కడైనా కుర్చీ పెట్టుకుని కూర్చోమన్నారు. నేను మళ్లీ ఎక్కడా స్థలం లేదని బదులిచ్చాను. అప్పుడు సరే ఇక్కడికి రా అని చెప్పి తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు’ అని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.

Also Read: Gannavaram Tragedy: ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం.. గన్నవరంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి!

‘ఆ రోజు నేను అక్కడ కూర్చున్న చోటే ఇప్పటికీ కూర్చుంటాను. అది డొమెస్టిక్ మ్యాచ్ అయినా, ఐపీఎల్ మ్యాచ్ అయినా.. ఏ మ్యాచ్ అయినా సరే ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది. నేను నా ప్రయాణం అక్కడి నుంచే ప్రారంభించాను. దేవుడి లాంటి సచిన్ టెండూల్కర్ గారు నన్ను అక్కడ కూర్చోబెట్టారు. అందుకే నేను ఎప్పుడూ అదే చోట కూర్చుంటాను. ఆ స్థానం నాకు బాగా కలిసొచ్చింది’ అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో దుమ్ములేపిన సూర్య.. భారత జట్టులోకి వచ్చాడు. ఏకంగా కెప్టెన్సీ అందుకుని.. జట్టుకు టీ20 వరల్డ్ కప్ అందించాడు. ప్రపంచ కప్ విజయాన్ని ఆస్వాదిస్తున్న సూర్య.. త్వరలో ఐపీఎల్ 2026 కోసం సన్నద్ధం కానున్నాడు.