Reading Time: 2 minutes
Pm Modi Discusses Tensions In West Asia With Iran President Pejeshkian

పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్‌‌కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తతలు, ప్రాణ నష్టంపై మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలాగే భారతీయుల భద్రత, ఇంధన సరఫరాపై కీలకంగా మోడీ చర్చించారు.

Pmmodi

ఫోన్ సంభాషణ తర్వాత మోడీ కీలక ట్వీట్ చేశారు. ‘‘పశ్చిమాసియాలోని తీవ్రమైన పరిస్థితి గురించి చర్చించడానికి ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియన్‌తో మాట్లాడాను. ఉద్రిక్తతలు పెరగడం, పౌర ప్రాణనష్టం, అలాగే పౌర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాను.’’ అని రాసుకొచ్చారు.

ప్రపంచ సంక్షోభం నుంచి ఉత్పన్నమయ్యే ఆర్థిక ఒత్తిళ్లను ప్రభుత్వం ఎలా నిర్వహించిందో రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ సమయంలో భారతదేశం విధానాన్ని ప్రధానమంత్రి మోడీ గుర్తుచేవారు. ‘‘యుద్ధ పరిణామాల భారం భారత పౌరులపై పడకుండా చూసుకోవడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అన్ని ప్రయత్నాలు చేసింది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం పెరిగినప్పుడు ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. అయినప్పటికీ రైతులకు రూ. 300కు యూరియా బ్యాగ్‌ను అందించాం. ఇది అంతర్జాతీయ మార్కెట్లో రూ. 3,000 ఖర్చవుతుంది.’’ అని మోడీ అన్నారు. తాజాగా రాష్ట్ర అధికారుల సహకారం కోరుతూ.. ప్రస్తుత సంక్షోభ సమయంలో మార్కెట్ తారుమారు, తప్పుడు సమాచారంపై కఠినమైన అప్రమత్తతను పాటించాలని ప్రధాని మోడీ కోరారు.

ఇది కూడా చదవండి: Netanyahu: ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మృతి

గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యాడు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులకు దిగింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. అయితే ఇటీవల భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. ఇరాన్ పెద్దలతో దౌత్యం నిర్వహించారు. దీంతో హార్ముజ్ నుంచి భారత నౌకలు సాఫీగా పంపించేందుకు ఇరాన్ అంగీకరించింది. ప్రస్తుతం 28 నౌకలు భారత్‌కు వస్తున్నాయి.