Reading Time: < 1 minute
Acb Raids Gajwel Tahsildar Sravan Kumar Disproportionate Assets Karimnagar

ప్రజాసేవ చేయాల్సిన ఉన్నతాధికారి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ ఆస్తుల వేటలో పడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్‌గా పనిచేస్తున్న కాటన్ శ్రవణ్ కుమార్.. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో లభించిన డాక్యుమెంట్లు, నగదు చూసి అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు.

Also Read:Rythu Bharosa: రైతు భరోసాపై కీలక ప్రకటన.. రైతుల అకౌంట్లో డబ్బులు జమ అప్పుడే..

కరీంనగర్‌లోని శ్రవణ్ కుమార్ నివాసం, ఆయన సోదరి ఇల్లు, ఇతర కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో సుమారు రూ. 4 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే.. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ ఇంకా భారీగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
సోదాల్లో పట్టుబడిన వాటిలో.. రూ. 11.90 లక్షల నగదుతో పాటు రూ. 4.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. రూ. 30 లక్షల విలువైన లగ్జరీ కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయి.

Also Read:India LPG Supply: ముగిసిన LPG సంక్షోభం.. భారత్‌కు భారీ స్థాయిలో గ్యాస్‌..

కరీంనగర్‌లో రెండు సొంత ఇళ్లు, ఒక అపార్ట్‌మెంట్‌లో ఆరు ఫ్లాట్లు, మరో నాలుగు ఖాళీ స్థలాలకు సంబంధించిన పత్రాలు.. వీటి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. 2.47 కోట్లుగా తేల్చారు. దాదాపు రూ. 15.66 లక్షల విలువైన విలాసవంతమైన వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారు. తన అధికారిక హోదాను ఉపయోగించుకుని శ్రవణ్ కుమార్ అక్రమంగా ఈ సంపదను ఆర్జించినట్లు ఏసీబీ దర్యాప్తులో స్పష్టమైంది. దీనిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు, ఆయనను అదుపులోకి తీసుకుని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.