Reading Time: < 1 minute

డంపింగ్ యార్డును  తరలించే వరకు పోరాటం ఆపం.. రిలే నిరాహార దీక్షకు దిగిన మడికొండ గ్రామస్తులు 

Caption of Image.
  • సమస్య పరిష్కరించకపోతే మున్సిపల్ ఎన్నికల బహిష్కరిస్తామని హెచ్చరిక

హనుమకొండ, వెలుగు: మడికొండ డంపింగ్ యార్డును వేరే ప్రాంతానికి తరలించే వరకు తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాటం కొనసాగిస్తామని బాధిత గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. సమస్యను పరిష్కరించకపోతే రాబోయే మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. డంపింగ్ యార్డును తరలించాలనే డిమాండ్‌‌తో స్థానికులు మంగళవారం రిలే నిరాహార దీక్షలకు దిగారు. రాంపూర్, కడిపికొండ, ఎల్కుర్తి, నర్సింగరావుపల్లి తదితర గ్రామాల ప్రజలు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదేళ్లుగా డంపింగ్ యార్డు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. పొగ, దుమ్ము, దుర్వాసనతో రోగాలపాలవుతున్నామని వాపోయారు. డంపింగ్​ యార్డు తరలింపుపై స్థానిక ఎమ్మెల్యే స్పష్టమైన హామీ ఇవ్వాలని, కలెక్టర్, గ్రేటర్ కమిషనర్ స్పందించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే మడికొండకు ఒక్క చెత్త ట్రాక్టర్ కూడా రానివ్వబోమని హెచ్చరించారు. వీరికి ఫోరం ఫర్ బెటర్ వరంగల్‌‌, పర్యావరణ కార్యకర్తలు మద్దతు ప్రకటించారు.

డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం..

డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ మడికొండకు చెందిన పండుగ రాజ్‌‌కుమార్ ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడే దీక్ష చేస్తున్న వారు అతడిని అడ్డుకున్నారు.

©️ VIL Media Pvt Ltd.