Reading Time: 2 minutes
Jnpa Waives Charges For Stranded Export Containers Middle East Crisis Relief

JNPA: అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మిడిల్ ఈస్ట్ (మధ్యప్రాచ్యం) దేశాలకు వెళ్లాల్సిన ఎగుమతులు నిలిచిపోయి ఆర్థిక భారంతో సతమతమవుతున్న వ్యాపారులకు జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (JNPA) ఊరటనిచ్చింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల నిలిచిపోయిన ఎగుమతి కంటైనర్ల కోసం భారీగా ఛార్జీల మినహాయింపును ప్రకటించింది. నిలిచిపోయిన కంటైనర్లపై గ్రౌండ్ రెంట్, రీఫర్ ప్లగ్-ఇన్ ఛార్జీలను రద్దు చేస్తూ ట్రేడ్ నోటీసు విడుదల చేసింది.

READ ALSO: Union Cabinet Decisions : అసెంబ్లీ ఎన్నికల వేళ.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

ప్రత్యేక చర్యలు ఇవే..
పోర్ట్, టెర్మినల్ ఆపరేటర్లు ఎగుమతి-దిగుమతి (EXIM) రంగానికి వెసులుబాటు కల్పించేందుకు ఈ క్రింది చర్యలు చేపట్టారు.

* స్టోరేజ్ సౌకర్యం: సరుకు రవాణా అయ్యే వరకు నిలిచిపోయిన కంటైనర్లను టెర్మినల్ యార్డుల్లోనే భద్రపరిచే అవకాశం.

* కస్టమ్స్ సంప్రదింపులు: ఇతర పోర్టుల నుంచి మధ్యప్రాచ్యానికి వెళ్లాల్సిన కంటైనర్లను తాత్కాలికంగా JNPA టెర్మినల్స్‌లో నిల్వ చేసేందుకు కస్టమ్స్ అధికారులతో చర్చలు.

* అదనపు స్థలం: అదనపు సరుకును ఉంచడానికి టెర్మినల్ ఆపరేటర్లకు మరికొంత స్థలాన్ని కేటాయించిన JNPA.

పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇబ్బంది పడుతున్న ఎగుమతిదారుల కోసం ప్రకటించిన రాయితీలు ఇలా ఉన్నాయి. ఫిబ్రవరి 28, 2026 నుంచి మార్చి 8వ తేదీ ఉదయం వరకు టెర్మినల్స్‌లోకి చేరిన కంటైనర్లపై 15 రోజుల పాటు (మార్చి 14 వరకు) 100% గ్రౌండ్ రెంట్ మినహాయింపు ఇచ్చారు. త్వరగా పాడైపోయే వస్తువులు ఉన్న కంటైనర్ల విద్యుత్ ఛార్జీలలో 80% మినహాయింపు లభిస్తుంది. ఇది కూడా 15 రోజుల పాటు వర్తిస్తుంది. ఈ రాయితీల వల్ల కలిగే ప్రయోజనం నేరుగా అసలు ఎగుమతిదారులకు అందేలా చూడాలని షిప్పింగ్ లైన్లు, ఫ్రైట్ ఫార్వార్డర్లను JNPA ఆదేశించింది. మధ్యప్రాచ్య సంక్షోభం వల్ల ఎదురైన భారాన్ని తగ్గించేందుకు JNPA తీసుకున్న ఈ నిర్ణయం ఎగుమతిదారులకు పెద్ద ఊరటగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.

READ ALSO: Team India Schedule 2026: టీమిండియా మళ్లీ మైదానంలోకి వచ్చేది అప్పుడే.. ఫుల్ షెడ్యూల్ ఇదే!