Reading Time: < 1 minute
Telangana Heatstroke Death Compensation 4 Lakhs Application Process

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. ముఖ్యంగా ఈ ఎండల కారణంగా సామాన్యులు, శ్రామికులు, రైతులు, ఉపాధి హామీ కూలీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జీవనోపాధి కోసం ఎండను సైతం లెక్కచేయకుండా పనిచేసే క్రమంలో చాలామంది వడదెబ్బకు గురవుతున్నారు. అయితే ఈ వడదెబ్బతో మరణించిన పేద కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వారికిచ్చే ఎక్స్‌గ్రేషియాను గతేడాది పెంచిన విషయం తెలిసిందే. గతంలో ఉన్న రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియాను రూ. 4 లక్షలకు పెంచుతూ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (SDMA) ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ పరిహారం పొందేందుకు పాటించాల్సిన నిబంధనలపై అవగాహన లేక చాలా కుటుంబాలు నష్టపోతున్నాయి.

Also Read:TTD: భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..

ఏం చేయాలి..?
వడదెబ్బ మరణాలను ధ్రువీకరించడానికి ప్రతి మండలంలో ఒక త్రిసభ్య కమిటీ ఉంటుంది. ఇందులో తహసీల్దార్, వైద్యాధికారి, సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) సభ్యులుగా ఉంటారు. మరణం సంభవించిన వెంటనే ఈ కమిటీకి సమాచారం అందించాల్సి ఉంటుంది.

వ్యక్తి వడదెబ్బతోనే మృతి చెందినట్లు తొలుత వైద్యాధికారి ధ్రువీకరించాలి. తర్వాత కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. పోలీసులు కేసు నమోదు చేసి పంచనామా నిర్వహిస్తారు. వడదెబ్బ మరణాలను శాస్త్రీయంగా నిర్ధారించడానికి మృతదేహానికి తప్పనిసరిగా పోస్ట్‌మార్టం నిర్వహించాలి. ఈ నివేదిక పరిహారానికి అత్యంత కీలకంగా ఉంటుంది.

Also Read:VB-G RAM G: ఉపాధి హామీ పథకం.. రూ.50 వేలు గెలుచుకునే అవకాశం.. ఎలా అంటే..

పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ సిద్ధం చేస్తారు. డెత్ సర్టిఫికేట్, పోస్ట్‌మార్టం రిపోర్ట్, ఎఫ్.ఐ.ఆర్, పంచనామా రిపోర్టులను జతచేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. మండల కమిటీ పంపిన నివేదికను ఆర్డీఓ (RDO) , జిల్లా కలెక్టర్ పరిశీలించి.. మృతుడి కుటుంబానికి రూ. 4 లక్షల పరిహారాన్ని మంజూరు చేస్తారు.