Reading Time: 2 minutes
IND vs NZ Final: ఆ బ్యాడ్‌లక్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో ఎంట్రీకి ముందే 2 మార్పులు.. ఈసారైన లక్ మారేనా?

IND vs NZ Final: ‘మెన్ ఇన్ బ్లూ’ మూడవసారి టీ20 ట్రోఫీని ముద్దాడేందుకు బీసీసీఐ కూడా శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవాలని బోర్డు భావించడం లేదు. ఎంతలా అంటే.. సెమీఫైనల్‌కు ముందు ముంబైలో చంద్రగ్రహణం ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రాక్టీస్ సెషన్‌ను 45 నిమిషాల పాటు ఆలస్యంగా ప్రారంభించారు.

ఇప్పుడు అహ్మదాబాద్‌లో హోటల్‌ మార్పు వెనుక కూడా బలమైన సెంటిమెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఎవరూ స్పందించకపోయినా.. గతంలో ఇదే హోటల్‌లో బస చేసినప్పుడు భారత్ రెండు కీలక మ్యాచ్‌లలో ఓడిపోయింది. (2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్, ఈ ఏడాది సూపర్-8లో సౌతాఫ్రికాతో మ్యాచ్). ఈసారి అదృష్టం తమ వైపు ఉండాలని కోరుకోవడంలో తప్పులేదంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

ఫైనల్‌కు ఎర్రమట్టి పిచ్ సిద్ధమా..?

రెండు వారాల క్రితం నల్లమట్టి పిచ్‌పై దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. అందుకే ఫైనల్ కోసం టీమ్ మేనేజ్మెంట్ ఎర్రమట్టి పిచ్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఎర్రమట్టి, నల్లమట్టి, రెండింటి మిశ్రమంతో కూడిన మూడు రకాల పిచ్‌లు ఉన్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఎర్రమట్టి పిచ్‌పై భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించిన నేపథ్యంలో.. ఇక్కడ కూడా అదే తరహా పిచ్ కావాలని కోరుకుంటున్నారు.

బీసీసీఐ సీఈఓ హేమంగ్ అమీన్ స్వయంగా పిచ్‌లను పరిశీలించారు. క్యూరేటర్లు ఒక నిర్దిష్ట పిచ్‌ను కవర్ చేసి ఉంచడం చూస్తుంటే, ఫైనల్ పోరు దానిపైనే జరిగేలా కనిపిస్తోంది.

ఫైనల్‌లో ‘రికీ మార్టిన్’ సందడి..!

ఆదివారం భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు ముందు సుమారు లక్ష మంది ప్రేక్షకులను అలరించేందుకు గ్రామీ అవార్డు గ్రహీత, ప్యూర్టో రికన్ సింగర్ రికీ మార్టిన్ రానున్నారు. ఆయనతో పాటు ‘దండియా క్వీన్’ ఫల్గుణి పాఠక్, బాలీవుడ్ సింగర్ సుఖ్విందర్ సింగ్ తమ ప్రదర్శనలతో స్టేడియాన్ని హోరెత్తించనున్నారు. టాస్‌కు ముందు రికీ మార్టిన్ తన ఐకానిక్ హిట్ సాంగ్ ‘అన్ దోస్ ట్రేస్ (వన్‌ టూ త్రీ) మారియా’తో అలరించనున్నారు.

అభిమానుల కోసం ప్రత్యేక రైలు..

ఫైనల్ మ్యాచ్ కోసం ముంబై నుంచి అహ్మదాబాద్‌కు భారీ సంఖ్యలో తరలివచ్చే అభిమానుల కోసం వెస్ట్రన్ రైల్వే ప్రత్యేక రైలును ప్రకటించింది. విమాన ప్రయాణ ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో, అభిమానులకు ఇది ఎంతో ఊరటనిచ్చే విషయం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..