Reading Time: < 1 minute

అధికారుల్లో జవాబుదారీతనం పెంచేందుకు ఆర్టీఐ : రాష్ట్ర సమాచార కమి షనర్లు

Caption of Image.
  •     రాష్ట్ర సమాచార కమిషనర్లు

కరీంనగర్, వెలుగు: అధికారుల్లో జవాబుదారీతనం పెంచేందుకు ఆర్టీఐ చట్టం దోహదం చేస్తుందని, దరఖాస్తుదారులకు సమాచారం ఇప్పించడమే కమిషన్ అంతిమ లక్ష్యమని రాష్ట్ర సమాచార కమిషనర్లు పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, భోరెడ్డి అయోధ్య రెడ్డి, మోసినా పర్వీన్, దేశాల భూపాల్ మీడియాతో మాట్లాడారు. 2025 మే 14న రాష్ట్ర సమాచార కమిషనర్లుగా తాము బాధ్యత తీసుకునే నాటికి 17,808 సెకండ్ అప్పీళ్లు రాష్ట్ర కమిషన్‌‌‌‌లో పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.

8 నెలల్లో ఇప్పటివరకు 15 జిల్లాల్లో పర్యటించి అక్కడే వాదనలు విని, సుమారు 9 వేల అప్పీళ్లను పరిష్కరించామని వెల్లడించారు. ఇంత త్వరగా అప్పీళ్లను పరిష్కరించడం దేశంలోనే మొదటిసారిగా పేర్కొన్నారు. 13 శాఖల్లో కేసుల సంఖ్య జీరోకి తెచ్చామని, సగటున నెలకు 643 కేసులు పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.

అంతకుముందు కలెక్టరేట్ ఆడిటోరియంలో పీఐవోలు, ఏపీఐవోలు, అప్పిలేట్ ఆఫీసర్లతో  సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సెక్షన్ 20 ప్రకారం దరఖాస్తుదారునికి ఎటువంటి ప్రత్యుత్తరం ఇవ్వకపోతే సంబంధిత అధికారికి రోజుకు రూ.250 ఫైన్, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, డీఆర్‌‌‌‌‌‌‌‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్ రమేశ్‌‌‌‌బాబు, ఏడీసీపీ వెంకటరమణ పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.