Reading Time: < 1 minute

T20 World Cup: రికార్డులు ముఖ్యం కాదు.. మేము గెలవడానికి ట్రై చేస్తామన్న పాకిస్థాన్ కెప్టెన్ 

Caption of Image.

T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026లో రేపు (ఫిబ్రవరి 15న) భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య పోరుకు ముందే హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఈసారి ఉత్కంఠ స్టేడియంలో కంటే బయటే ఎక్కువగా కనిపిస్తోంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస గ్రౌండ్ లో జరిగే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కీలక వ్యాఖ్యలు చేశారు.  

పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మాట్లాడుతూ.. కేవలం మ్యాచ్ వ్యూహాల గురించే కాకుండా, క్రికెట్ ఒకప్పుడు ఎలా ఉండేదో గుర్తు చేశారు. రాజకీయాల ప్రభావం లేకుండా, అభిమానులు కేవలం ఆట కోసమే చప్పట్లు కొట్టే రోజులు మళ్లీ రావాలని కోరుకున్నారు. గతంలో భారత్– పాక్ మధ్య రాజకీయ సంబంధాలు అంతగా బాగోలేని సమయంలో కూడా, ఎక్కువగా క్రికెట్ గురించే చర్చలు జరిగేవని ఆయన చెప్పారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడంతో, ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఆడటం వలన తమపై ఒత్తిడి మరింత పెరిగిందని సల్మాన్ అఘా అభిప్రాయపడ్డారు. 

క్రికెట్ ప్రారంభమైనప్పటి నుంచి ఏ స్పూర్తితో ఆడుతున్నారో, అదే స్పూర్తితో ఈ మ్యాచ్ కూడా జరగాలని పాకిస్థాన్ సారథి సల్మాన్ అఘా అన్నారు. ప్రతి ఒక్క ప్లేయర్ ఆటను గౌరవించాలని ఇరు జట్లకూ పిలుపునిచ్చారు. మ్యాచ్ సమయంలో భారత ఆటగాళ్లు హ్యాండ్‌షేక్‌కు ముందుకు వస్తే మీరు సిద్ధమేనా? అనే ప్రశ్నకు ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. “రేపు చూస్తాం” అని మాత్రమే చెప్పారు. గత రికార్డులు ముఖ్యం కాదు.. రేపు అనేది కొత్త రోజు… మేము చరిత్రను మార్చలేమని, కానీ ఈసారి మెరుగ్గా ఆడి గెలవడానికి ప్రయత్నిస్తామని సల్మాన్ అలీ అఘా స్పష్టం చేశారు.
 

©️ VIL Media Pvt Ltd.