Reading Time: < 1 minute

చోరీ కేసులో పోలీసులు కొడుతున్నారని.. పీఎస్ పై నుంచి కిందికి దూకిన యువకుడు

Caption of Image.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్‌లో ఓ యువకుడు మొదటి అంతస్తు నుంచి కిందకు దూకిన ఘటన కలకలం రేపింది. బోరు మోటారు చోరీ కేసులో పోలీసులు వేధిస్తున్నారనే భయంతోనే తాను కిందకు దూకినట్లు యువకుడు తెలిపాడు. గాయపడిన యువకుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించినట్లు తెలిసింది.

గ్రామంలో బోరు మోటారు చోరీ జరిగిందనే ఆరోపణలతో నాలుగు రోజుల క్రితం పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో కిన్నెర అజయ్ (18), కిన్నెర లింగస్వామి, కిన్నెర మనోజ్, గంధం సాయి ఉన్నారు. కేసు విచారణలో భాగంగా పోలీసులు తమను స్టేషన్‌కు పిలిపిస్తున్నారని బాధితుల తరఫున ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తాను నిజం ఒప్పుకున్నప్పటికీ మూడు రోజులుగా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కొడుతున్నారని, ఈ వేధింపులకు భయపడి స్టేషన్ మొదటి అంతస్తు నుంచి కిందకు దూకినట్లు అజయ్ చెప్పాడు. అయితే, ఈ ఆరోపణలపై పోలీసుల అధికారిక వివరణ, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.అజయ్ కిందకు దూకి గాయపడటంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. 

 

 

©️ VIL Media Pvt Ltd.