
వాషింగ్టన్: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరుదేశాల మధ్య ఇంధన కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. ఒకరి ఇంధన మౌలిక సదుపాయాలు, ఆయిల్ రిఫైనరీలపై మరొకరు దాడులు చేసుకోకూడదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం (అక్టోబర్ 11) తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు.
‘‘తక్షణమే అమలులోకి వచ్చేలా రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఇంధన కాల్పుల విరమణ కుదిరింది. ఇరుపక్షాలు దీనికి అంగీకరించాయి. దీనిని ఉల్లంఘించవద్దు’’ అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందంపై అమెరికా గానీ, ఉక్రెయిన్ గానీ అధికారికంగా ధృవీకరించలేదు.
గత నాలుగున్నరేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల ఇరుదేశాల మధ్య దాడుల తీవ్రత మళ్లీ పెరిగింది. రష్యా, ఉక్రెయిన్ దేశాలు ఒకరి ఇంధన మౌలిక సదుపాయాలపై మరొకరు పదేపదే లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేసుకుంటున్నారు. దీని వల్ల అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడి ధరలు భారీగా పెరిగాయి.
ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో చమురు (డీజిల్) ఒప్పందం కుదుర్చుకున్నారు. నవంబర్లో జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలను తగ్గించి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నది.
రష్యాపై గతంలో విధించిన యుద్ధ ఆంక్షలను సడలించినట్లు తెలుపుతూ.. భారీ మొత్తంలో డీజిల్‌ను దిగుమతి చేసుకుంటామని ట్రంప్ వెల్లడించారు. రష్యా నుంచి వెంటనే 3 లక్షల టన్నులకు పైగా డీజిల్ రానుందని, నవంబర్లో మరో 5 లక్షల టన్నులు, ఆ తర్వాత లక్షలాది టన్నుల ఇంధనం అమెరికాకు సరఫరా అవుతుందని వివరించారు.
ట్రంప్ నిర్ణయంపై జెలెన్క్సీ ఫైర్
రష్యా నుంచి డీజిల్ కొనుగోలు చేసేందుకు అమెరికా చేసుకున్న ఒప్పందాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా వ్యతిరేకించారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న ఇతర దేశాలపై అదనపు సుంకాలు విధిస్తున్న ట్రంప్.. ఇప్పుడు అదే దేశం నుంచి ఎలా చమురు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. అమెరికా రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడమంటే ఉక్రెయిన్‌పై యుద్ధం చేయడానికి పుతిన్‌కు స్వయంగా నిధులు అందించడమేనని విమర్శించారు.
ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరం: ట్రంప్
రష్యాతో అమెరికా చమురు ఒప్పందం చేసుకోవడాన్ని వ్యతిరేకించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ట్రంప్ ఫైర్ అయ్యారు. 2022 ఫిబ్రవరిలో రష్యాతో ప్రారంభమైన యుద్ధాన్ని ముగించడంలో జెలెన్స్కీ ఘోరంగా విఫలమయ్యారని ట్రంప్ విమర్శించారు. రష్యాతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవడంలో జెలెన్స్కీ ఏ మాత్రం చొరవ చూపలేదని ఆరోపించారు.
రష్యాతో యుద్ధం కారణంగా జెలెన్స్కీ ఉక్రెయిన్ 30 శాతం భూభాగాన్ని కోల్పోయారని.. ఇరు దేశాల మధ్య పది లక్షలకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారని.. రెండు మిలియన్ల కంటే ఎక్కువ మంది చనిపోయారని పేర్కొన్నారు. అసలు ఇది ప్రారంభం కాకూడని ఒక అనవసరమైన యుద్ధమని అభిప్రాయపడ్డారు.
►ALSO READ | నేపాల్‌లో మళ్లీ భారీ వరద బీభత్సం.. గండికీ నదిలో కొట్టుకుపోయిన గ్రామం,10 మంది గల్లంతు
రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ దాడులు చేయడం వల్లే అమెరికాతో పాటు అంతర్జాతీయంగా ఇంధన కొరత ఏర్పడిందన్నారు. అమెరికాలోని రైతులు, పశుపోషకులు డీజిల్ ఇంధన ధరల పరంగా ఇబ్బందులు పడుతున్నారని వ్యక్తం చేశారు.
రష్యాలోని ఇంధన మౌలిక సదుయాలపై తక్షణమే దాడులు నిలిపివేయాలని ఉక్రెయిన్ను హెచ్చరించారు. రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకుని యుద్ధాన్ని ఆపేందుకు జెలెన్స్కీ స్థానంలో ఉక్రెయిన్ కు కొత్త అధ్యక్షుడు రావాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒప్పందం గురించి నాకు తెలియదు: జెలెన్స్కీ
ఉక్రెయిన్, రష్యా మధ్య ఇంధన కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందన్న ట్రంప్ ప్రకటన గురించి తనకు తెలియదని జెలెన్స్కీ పేర్కొన్నారు. అయితే, రష్యా ఇంధన కాల్పుల విరమణకు అంగీకరిస్తే ఉక్రెయిన్ కూడా అంగీకరిస్తుందని స్పష్టం చేశాడు. ఒకవేళ అధ్యక్షుడు ట్రంప్ పుతిన్‌తో దీనిపై చర్చలు జరిపి ఉంటే దయచేసి కాల్పుల విరమణ ఎప్పుడు ప్రారంభమవుతుందో మాకు చెప్పండి.. మేము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నాడు.