Reading Time: 2 minutes

ఫగ్వారా క్యాంపస్‌లో అత్యాచారం కేసు, నిరసనలపై.. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కీలక ప్రకటన

Caption of Image.

పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)లో విద్యార్థినిపై అత్యాచారం ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు  దారితీసింది. ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగగా.. పరిస్థితి క్రమంగా అదుపుతప్పి క్యాంపస్‌లో విధ్వంసం, జాతీయ రహదారి దిగ్బంధానికి దారితీసింది. మరోవైపు అత్యాచార ఆరోపణపై పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై FIR నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతులను LPU యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. 

లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఏం జరిగింది?

పంజాబ్‌లోని ఫగ్వారా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)లో సెప్టెంబర్ 26 రాత్రి ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ముఖ్యంగా G3 బాలికల హాస్టల్‌కు చెందిన విద్యార్థినిపై అఘాయిత్యం జరిగిందని, యూనివర్సిటీ వర్గాలు విషయాన్ని దాచిపెడుతున్నాయంటూ మేసేజ్ లు వైరల్ అయ్యాయి. 

విద్యార్థులు ఆందోళనకు కారణం.. 

వైరల్‌ అయిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని, నిజానిజాలను వెల్లడించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. నిరసనలు క్రమంగా తీవ్రరూపం దాల్చడంతో యూనివర్సిటీలో ఆగ్రహంతో విధ్వంసం సృష్టించారు.  క్యాంపస్‌లో కిటికీలు, బెంచీలు, పూలకుండీలు ధ్వంసం చేశారు. కొన్ని చోట్ల వస్తువులకు నిప్పు పెట్టినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత విద్యార్థులు జలంధర్-ఫగ్వారా జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. 

పోలీసులు ఏం చెబుతున్నారంటే..

మొదట పోలీసులు తమకు ఇలాంటి ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారంతోనే విద్యార్థులు గుమిగూడారని తెలిపారు. అనంతరం విద్యార్థుల వాంగ్మూలం ఆధారంగా గుర్తుతెలియని వ్యక్తిపై అత్యాచారం ఆరోపణకు సంబంధించి FIR నమోదు చేశామన్నారు. CCTV ఫుటేజ్, ఫోరెన్సిక్ ఆధారాలు, ఫోన్ డేటాను పరిశీలించి దర్యాప్తు చేస్తామని అధికారులు తెలిపారు.

►ALSO READ | రోడ్డు నిర్మాణంలో అవినీతిపై నిరసన.. యువకుని చెంప చెళ్లుమనిపించిన మంత్రి!

యూనివర్సిటీ స్పందన..

LPU రిజిస్ట్రార్ డాక్టర్ మోనికా గులాటి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తలు, వదంతులు అసత్యం, నిరాధారం, కల్పితం అని ఖండించారు. యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రచారం జరుగుతోందని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మొద్దని కోరారు.

ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విద్యార్థుల ఆరోపణలు, సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రచారం, యూనివర్సిటీ వాదనల మధ్య వాస్తవాలు నిర్ధారించాల్సి ఉంది. ప్రస్తుతం నిందితుడి గుర్తింపు అధికారికంగా వెల్లడికాలేదు.

©️ VIL Media Pvt Ltd.