
హైదరాబాద్: తెలంగాణలో TG SAFE నోటీసులు, అధికారుల చర్యలను కొందరు హోటల్ నిర్వాహకులు బేఖాతర్ చేస్తున్నారు. నిన్న పలు హోటళ్లు, రెస్టారెంట్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. నిబంధనలకు అనుగుణంగా లేని సంస్థలపై చర్యలు తీసుకోవడంతో పాటు, కొన్ని హోటళ్ల లైసెన్సులను రద్దు చేస్తూ నోటీసులు జారీ చేశారు.
అయితే లైసెన్సులు రద్దు చేసినప్పటికీ కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు యథావిధిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. దీంతో అధికారుల చర్యలు, నోటీసుల అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గచ్చిబౌలిలోని అంతెరా బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్‌ను అధికారులు రద్దు చేశారు. సంబంధిత నోటీసులు జారీ చేసినప్పటికీ.. ఇవాళ సెప్టెంబర్ 27న రెస్టారెంట్ తెరిచారు. లైసెన్స్ రద్దు చేసిన సంస్థ తిరిగి ఎలా కార్యకలాపాలు కొనసాగిస్తోంది? అధికారుల అనుమతి లేకుండా హోటల్‌ను తెరిచారా? అనే అంశాలపై చర్చ జరుగుతోంది.
మరోవైపు అంతెరా బార్ అండ్ రెస్టారెంట్ ఇవాళ తెరిచి ఉండటంతో అక్కడకు పెద్ద సంఖ్యలో కస్టమర్లు వచ్చారు. ఫుడ్ తినేందుకు జనం ఎగబడ్డారు. అధికారులు లైసెన్స్ రద్దు చేస్తూ చర్యలు తీసుకున్నప్పటికీ, అదే సంస్థ తిరిగి తెరుచుకోవడంపై అధికారులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
హోటళ్లు, రెస్టారెంట్లలో భద్రతా ప్రమాణాలు, అనుమతులు, లైసెన్సులు, ఇతర నిబంధనల అమలుపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంస్థలపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.అయితే లైసెన్స్ రద్దు చేసిన తర్వాత కూడా హోటల్‌ను నిర్వహిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.