Reading Time: < 1 minute
Karthi Questions Tvk Government Police Weekly Off Issue

Karthi: తమిళనాడు రాజకీయ యవనికపై కొత్త పార్టీలు గద్దెనెక్కినా, పాత పార్టీలు పాలించినా క్షేత్రస్థాయిలో మారేదేమీ లేదంటూ స్టార్ హీరో కార్తి చేసిన కామెంట్స్ ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎన్నికల వేళ రాజకీయ నేతలు ఇచ్చే ఆర్భాటపు హామీలు అధికారం దక్కగానే కాగితాలకే పరిమితమవుతున్నాయన్న పచ్చి నిజాన్ని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రజల ప్రాణాలను, శాంతిభద్రతలను కాపాడేందుకు ఆహార నిద్రలు మాని రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పోలీసుల సమస్యలపై ఆయన సూటిగా విజయ్ సర్కార్‌ను నిలదీసిన తీరు చర్చనీయాంశంగా మారింది.

కోయంబత్తూరులో మాజీ పోలీస్ అధికారుల సంక్షేమ ట్రస్ట్ 10వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్తి, పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న మానసిక, శారీరక ఒత్తిడిపై గళమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో డీఎంకే ప్రభుత్వం అయినా, ఇప్పుడు కొత్తగా పగ్గాలు చేపట్టిన టీవీకే (తమిళగ వెట్రి కళగం) ప్రభుత్వం అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు తీసుకురాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీల హామీలు అమలుకు నోచుకోలేదు.. ఇప్పుడొచ్చిన ప్రభుత్వం కూడా పోలీసులకు వారంలో ఒక రోజు సెలవు (వీక్లీ ఆఫ్) ఇస్తామని గంభీరంగా చెప్పినప్పటికీ, అది ఉత్తర్వులకే పరిమితమైందని ఎండగట్టారు.

సమాజం కోసం నిరంతరం విధుల్లో ఉండే పోలీసులకు కనీసం వారాంతపు సెలవు ఎందుకు ఇవ్వడం లేదని కార్తి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. “ఆఫీసర్లకు కనీస విశ్రాంతి కల్పించకపోతే వారి ఆరోగ్యం, కుటుంబ జీవితం తీవ్రంగా దెబ్బతింటాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేసి సిబ్బందికి వీక్లీ ఆఫ్ కేటాయించాలి” అని డిమాండ్ చేశారు. ‘ఖాకీ’ చిత్రంలో నిజాయితీగల పోలీస్ అధికారిగా నటించిన అనుభవంతో వారి కష్టనష్టాలు తనకు తెలుసని పేర్కొన్న ఆయన, నేర పరిశోధనలో అంకితభావంతో పనిచేసే నిజాయితీపరులైన అధికారులకు మీడియా సైతం బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరో నేరుగా ప్రభుత్వ విధానాల వైఫల్యాన్ని ప్రశ్నించడంతో ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది.