
- మహారాష్ట్ర, కర్నాటకలో తగ్గిన దిగుబడి
- పొరుగు రాష్ట్రాల నుంచి రవాణాకు బ్రేక్
- 100 నుంచి 52 లోడ్లకు సప్లై డౌన్
- ఇదే అదనుగా ధర పెంచిన వ్యాపారులు
హైదరాబాద్, వెలుగు: ఉల్లి ధరలు పైపైకి పోతున్నాయి. నెల క్రితం రూ.30 పలికిన కిలో ఉల్లి.. ఇప్పుడు రూ.70కి చేరింది. డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్ మలక్‌పేట్ హోల్‌సేల్ మార్కెట్‌లో క్వింటా ఉల్లి ధర
గరిష్టంగా రూ.45 వేల నుంచి రూ.52 వేలు పలుకుతోంది. దీంతో బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లిని రూ.65 నుంచి రూ.70 వరకు అమ్ముతున్నారు. గత నెలతో పోలిస్తే ఇది సుమారు రెండు రెట్లు ఎక్కువ.
పక్క రాష్ట్రాల్లో వర్షాలతో దెబ్బతిన్న పంట
రాష్ట్రానికి ఎక్కువగా మహారాష్ట్ర, ఏపీలోని కర్నూల్ నుంచి ఉల్లి దిగుమతి అవుతుంది. ఇటీవల ఆయా ప్రాంతాల్లో వర్షాలు పడడంతో ఉల్లి పంట దెబ్బతిన్నది. దీంతో రాష్ట్రానికి ఉల్లి దిగుమతి బాగా తగ్గింది. గత ఏడాది కూడా ఉల్లి రైతులకు నష్టాలు రావడంతో కర్నూల్లో రైతులు సాగు తగ్గించారు. రెండు ఎకరాల్లో ఉల్లి వేసిన రైతులకు కనీసం 150 బస్తాల ఉల్లి దిగుబడి రావాల్సి ఉండగా వర్షాల కారణంగా కనీసం 50 బస్తాలు కూడా రాలేదు. దీంతో మార్కెట్‌కు ఉల్లి రాక తగ్గి రేట్లు భారీగా పెరిగాయి.
మహారాష్ట్ర, ఏపీ నుంచి రోజూ వంద పైచిలుకు ఉల్లి లారీలు హైదరాబాద్‌కు వస్తుంటాయి. కానీ శనివారం మలక్‌పేట్, ఉస్మాన్‌గంజ్ హోల్‌సేల్ మార్కెట్‌కు కేవలం 53 ఉల్లి లోడ్లు మాత్రమే వచ్చాయి. అదీ మహారాష్ట్ర నుంచి 39 లారీలు, కర్నూల్ నుంచి 10, కర్నాటక నుంచి 4 లోడ్ల ఉల్లి వచ్చింది. ఉల్లి లోడ్ల సంఖ్య సగానికి పడిపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి.
లోకల్ పంట వచ్చే వరకు తిప్పలే..
మన రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, తాండూరు, మెదక్ , నారాయణఖేడ్, కొల్లాపూర్, అలంపూర్, నల్గొండ తదితర ప్రాంతాల్లో సుమారు 40 వేల ఎకరాల్లో ఉల్లి సాగవుతుంది. రాష్ట్రంలో పండే ఉల్లి అక్టోబర్, నవంబర్ నెలల్లో మార్కెట్‌కు వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ పంట వస్తేనే ధరలు కొంచెం దిగి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.