Reading Time: < 1 minute
4 ఓవర్లు, 0 రన్స్‌తో 2 వికెట్లు.. టీ20 హిస్టరీలోనే అరుదైన రికార్డ్.. ఎవరో కాదు మనోడే భయ్యో..!

Indian Cricket Records: టీ20 క్రికెట్‌లో బ్యాటర్ల దూకుడే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ బంతి అనుకూలిస్తే బౌలర్లు కూడా అసాధారణ ప్రదర్శన చేయగలరని విదర్భ స్పిన్నర్ అక్షయ్ కర్నేవార్ నిరూపించాడు. 2021 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు చేసిన ఘనత ఇప్పటికీ ప్రత్యేకంగానే నిలిచింది. నాలుగు ఓవర్లు వేసిన కర్నేవార్.. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా రెండు వికెట్లు పడగొట్టాడు.

నాలుగు ఓవర్లూ మెయిడెన్లే..!

టీ20లో ఒక మెయిడెన్ ఓవర్ సాధించడమే గొప్ప విషయం. కానీ కర్నేవార్ ప్రదర్శన దానికంటే చాలా ముందుకెళ్లింది. తన కోటా 4 ఓవర్లను పూర్తిగా మెయిడెన్లుగా మార్చాడు. అంటే 24 బంతుల్లో ప్రత్యర్థి టీం ఒక్క పరుగు కూడా సాధించలేకపోయింది. అదే సమయంలో రెండు వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

భారత క్రికెట్‌లో ప్రత్యేక ఘనత..

ఈ ప్రదర్శనతో టీ20 ఫార్మాట్‌లో 4 ఓవర్లు వేసి 0 పరుగులకు 2 వికెట్లు తీసిన ఏకైక భారత బౌలర్‌గా అక్షయ్ కర్నేవార్ నిలిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ వంటి దేశీయ టీ20 వేదికపై సాధించిన ఈ రికార్డు అతడి బౌలింగ్ సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది.

స్పిన్ ఆల్‌రౌండర్‌గా..

కర్నేవార్ ప్రత్యేకత బౌలింగ్‌కే పరిమితం కాదు. అతడు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఎడమ చేతితో బ్యాటింగ్ చేస్తూ, కుడి చేతితో బౌలింగ్ చేసే అరుదైన క్రికెటర్లలో ఒకడు. విదర్భ తరపున దేశీయ క్రికెట్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.

మూడు ఫార్మాట్లలోనూ అనుభవం..

కర్నేవార్ ఫస్ట్‌క్లాస్, లిస్ట్-ఎ, టీ20 క్రికెట్‌లో ఆడాడు. 22 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 40 వికెట్లతో పాటు 877 పరుగులు సాధించాడు. లిస్ట్-ఎలో 51 మ్యాచ్‌లు ఆడి 69 వికెట్లు తీసుకున్న అతడు 762 పరుగులు కూడా చేశాడు. టీ20ల్లో 64 మ్యాచ్‌ల్లో 62 వికెట్లు, 516 పరుగులు నమోదు చేశాడు.

టీ20లో బ్యాటర్లకు అనుకూలంగా ఉండే పరిస్థితుల్లో బౌలర్‌కు పరుగులు కట్టడి చేయడం పెద్ద సవాలే. అలాంటి ఫార్మాట్‌లో నాలుగు ఓవర్లూ మెయిడెన్లు వేసి, రెండు వికెట్లు సాధించడం కర్నేవార్ రికార్డును మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది. దేశీయ క్రికెట్‌లో అతడి ఈ అరుదైన బౌలింగ్ ప్రదర్శన భారత టీ20 చరిత్రలో గుర్తుండిపోయేలా చేసింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..