Reading Time: 4 minutes

అక్షయ సాహితి: ఎనభై ఒక్క గొంతుల అక్షర బతుకమ్మ .. తీరు తీరు పూలు

Caption of Image.

కవిత్వం అంటేనే పరిమళించేది. కవిత్వం అంటేనే గుబాళించేది. బతుకమ్మలో తీరు తీరు పూలు చేరి ఒక సుందర రూపమైనట్టు, 81 మంది కవుల అంతరంగ అక్షరాలు ఒక్కటై రూపుదిద్దుకున్న అక్షర వేడుకే ఈ ‘‘తీరు తీరు పూలు (అన్నీ గుబాళించేవే)’’. సంకలనానికి పేరు పెట్టడంలోనే సంపాదకులు, సంస్థ ఈ ప్రయత్నం వెనుక ముఖ్య ఉద్దేశాన్ని చెప్పేశారు

మంచిర్యాల జిల్లా, లక్సెట్టిపేట కేంద్రంగా పనిచేస్తున్న అక్షయ సాహితీ సృజన కళావేదిక సంస్థ నుంచి, శ్రీ వేనంక చక్రవర్తి గారు సంపాదకులుగా 81 మంది కవుల 82 కవితల సమాహారంగా వెలువడిందే ఈ సంకలనం. పద్యం నుంచి వచనం దాకా, కవిత్వం నుండి తాత్విక వ్యాసం దాకా ప్రతి ప్రక్రియకూ ఒక ప్రత్యేక శైలి, ఒక ప్రత్యేక నడక ఉంటాయి. 

ఈ వైవిధ్యాన్నంతటినీ ఒకే చోట చేర్చి పాఠకులకు ఒక సంపూర్ణ సాహిత్య విందు అందించాలనే సంకల్పంతో రూపుదిద్దుకున్నదే ఈ ‘తీరు తీరు పూలు’ అని సంపాదకులు వేనంక చక్రవర్తి తమ ముందుమాటలో ‘‘ఒక ప్రయత్నానికి ముందర..’’ అంటూ చెప్పుకొచ్చారు. 

ఒక్కో పువ్వుది ఒక్కో రంగు. ఒక్కో కవిది ఒక్కో తీరు. ఏక ఆలోచనా దృక్పథానికి పరిమితమయ్యే ఏక-రచయిత సంకలనాలకు భిన్నంగా, 81 మంది విభిన్న శైలులు, భావజాలాలు కలిగిన కవుల 82 కవితల సమాహారమైన ఈ పుస్తకం, పాఠకుడికి ఒకే చోట లభించే సమగ్ర వర్ణాల కవితా తోటగా నిలుస్తుంది. తీరు తీరు పూలతో ముస్తాబైన ఈ బతుకమ్మలో ఒక పువ్వు ప్రేమది, మరో పువ్వు పోరాటానిది. ఒక పువ్వు రైతు నుదుటి చెమట చుక్కది, ఇంకో పువ్వు స్త్రీ గుండెలోని ధైర్యపు జ్వాలది. ఒక పువ్వు బాల్యపు నవ్వులది, ఒక పువ్వు తెలంగాణ మట్టి పరిమళానిది. ఒక పువ్వు మొండి ధైర్యానిది.

వైవిధ్యభరిత అక్షర యాత్ర

సంకలనం ఘనపురపు సంతోష్ కుమార్ రాసిన గణపతి కీర్తనతో మంగళకరంగా ప్రారంభమవుతుంది. రైతు జీవన వేదన అంశంపై కూడా రాజేందర్ గారు తన ‘తప్పుడు గింజలు’ కవితలో “మొరాయించిన విత్తును పక్కనపెట్టి / రైతు దంపతులే ఏపుగా మొలకెత్తినారు సమాధులై” అంటూ కరుణాత్మకంగా అల్లారు. 

వేముల వినోద్ కుమార్ ‘సముద్ర తీరం’ కవితలో ‘అన్నీ తెలిసే సముద్రంలోకి వెళుతున్న నిన్ను / కాలమే అక్కడ కలిపేస్తుందో లేదా తీరానికి చేరుస్తుందో’ అంటూ మత్స్యకారుల జీవితాన్ని ప్రతిబింబించారు. కొమ్ము సాగరిక తన ‘ఆమె అంతరంగం’ కవితలో ‘విభిన్న సంస్కృతులని గొప్పగా చెప్పుకొనే నా దేశంలో / వివస్త్రను చేసిన వెలుగులోకి రాని వేరే దేశం అని చెప్పనా’ అంటూ వర్తమాన భారతాన్ని ప్రతిబింబించారు. 

తెలంగాణ మాండలికానికి ప్రతినిధిగా అల్లాడి శ్రీనివాస్ ‘పామురపు మట్టి గోడలు’ కవితలో ‘గా మట్టిలనే పామురం కలిసి ఉంటది / గందుకే గా మట్టి గోడలు మా గుండెల తీర్గ గట్టిగుంటయి’ అంటూ మట్టి గోడల ఇంటి ఔన్నత్యాన్ని వివరించారు. గోపతి ప్రశాంత్ ‘ఊరెళ్ళి పోతా’ కవితలో ‘జీవితాన్నే జీతంగా మార్చుకునే మన మనసులకు దూరంగా / అణువణువూ నా విషయాన్ని నింపుకొని తీయగా నవ్వుతూ నట్టేట ముంచే నవ మానవులకు దూరంగా’ అంటూ నగర జీవన వేదనను వ్యక్తం చేశారు. 

భారతి నూటెంకి ‘కొన్ని ఖాళీలు అవసరం’ కవితలో ‘గుండెల్లో గొంగళి పురుగు లాంటి గూడు కట్టుకున్న గాయాలు మరిచి రంగురంగుల సీతాకోకచిలుకల్లా మారి ప్రశాంతంగా విహరించడానికి కొన్ని ఖాళీలు అవసరం’ అంటూ అద్భుతమైన కవిత రాశారు. 

డాక్టర్ తన్నీరు సురేష్ ‘నగ్నతే నాగరికత’ కవితలో ‘నగ్నత్వమే నేటి నాగరికత / సోషల్ మీడియా విశృంఖల శరీరదర్శనం ప్రదర్శనం / ఇదే ఇప్పటి బతుకు విధానం’ అంటూ రీల్స్ మోజులో పడి నేటి యువత అనుసరిస్తున్న పెడధోరణులను ఎత్తిచూపారు. 

డాక్టర్ శ్రీనాథ్ గౌడ్ ‘కైతా ఎలా ఉండాలో చెప్తూ కవితలో ‘కైతా ఇల్లు కట్టినట్టు ఉండాలే / భావం పెద్ద దర్వాజా దెర్శినట్టు ఉండాలే / కైతరాసెటోల్ల అనుభవం ఇంటి చుట్టూ సూరు పెట్టినట్టు’ అంటూ కవిత్వ నిర్మాణాన్నే ఒక కవితగా వివరించారు. 

స్త్రీవాద కోణంలో ఝాన్సీ రాణి గారు ‘కాస్త దారినివ్వండి చాలు’ కవితలో ‘ఆమె ఎగిసే కెరటం, అంబరాన్ని తాకనివ్వండి / ఆమె విరిసే కుసుమం, కలల పరిమళం వెదజల్లనివ్వండి / ఆమె ఓ అద్భుతం, తన అస్తిత్వాన్ని నిలుపుకోగలిగే దారినివ్వండి’ అంటూ తనలోని స్త్రీవాద కవిత్వాన్ని బలంగా వ్యక్తపరిచారు. 

తెలుగు భాషాభిమానంతో పెద్ది భరత్ తేటగీతిలో ‘ఒక్క చెట్టుకు పూచిన పెక్కు విరుల / తీరు తెలుగు భాష రుచులు వేరు వేరు / భాష నేర్పును సంస్కృతి భరత సుతుడ / తెలుగు పద్యము లొలుకవా తేనె ధార’ అంటూ తెలుగు భాషలోని మాండలిక వైవిధ్యాన్ని కీర్తిస్తూ అద్భుతమైన పద్యం రాశారు.

వెల్గం సుధాకర్ ‘నాకు మరణం లేదు’ కవితలో “నాకు మరణం లేదు / ఎందుకంటే నేను ప్రశ్నను / నిరంతరం ప్రజ్వలించే నిప్పు కణికను” అంటూ ప్రశ్నించే తత్వం ఎప్పుడూ సజీవంగానే ఉంటుందని చాటిచెప్పారు. నూటెంకి రవీంద్ర ‘లోకం’ కవితలో ‘ఇచట రక్తమాంసాలు అమ్మకపు సరుకులు / చెమటా చీములు ద్రవ్య మారకములు’ అంటూ మనిషి శ్రమ, చెమట, రక్తం ఇప్పుడు మార్కెట్‌లో విలువ కట్టబడే వస్తువులుగా మారిపోయాయని నిర్భయంగా చెప్తారు. 

లేదాళ్ళ రాజేశ్వరరావు ‘కథనొకటి చెప్పాలి’ కవితలో ‘అలా చప్పరిస్తూ ఉంటాను గతాల్ని / గతాల తరపు గాయాల్ని’ అనే ప్రారంభమే ప్రత్యేకంగా ఉంటుంది. గతాన్ని కేవలం గుర్తు చేసుకోవడం కాదు, ‘చప్పరించడం’ అనే పదం ద్వారా గాయాన్ని మళ్లీ మళ్లీ రుచి చూసే బాధను వ్యక్తం చేస్తారు గాయం మానిపోయినా దాని రుచి మాత్రం మిగిలి ఉండటమే ఇందులోని భావం. ‘ఎవరైనా నాతో కలివిడిగా నిలబడతారా? కన్నీళ్ళద్దిన కథనొకటి చెప్పాలి’ అనడం మొత్తం కవితకు హృదయంగా నిలుస్తుంది.

 కవి కోరుకునేది కేవలం సానుభూతి మాత్రమే కాదు  తన పక్కన నిలబడే ఒక మనిషి. ఇక్కడ ‘కథ’ అనేది కేవలం ఒక సంఘటన కాదు; కవి తన జీవితాన్నే ఒక కన్నీటి కథగా మలుస్తారు.
ఈ సంకలనంలోపాటలు, గజల్స్, గేయాలు, సీస పద్యాలు, కంద పద్యాలు, ఆటవెలదులు, ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం, మణిపూసలు ఇలా అన్ని ప్రక్రియలు ఒక సంపూర్ణ సంతులిత భోజనంలా అద్భుతంగా కుదిరాయి. ఏక కవితా రూపానికి పరిమితం కాకుండా, ఛందోబద్ధ పద్యం నుండి ఆధునిక భావకవిత్వం దాకా అన్ని పాయలనూ ఒకే తీరంలోకి చేర్చడం ఈ సంకలనం ప్రత్యేకత.

మంచిర్యాల గడ్డ కవిత్వ సంభావ్యతకు దర్పణం

ఈ సంకలనం కేవలం ఒక కవితా సమాహారం మాత్రమే కాదు మంచిర్యాల జిల్లా నుంచి వెలువడుతున్న కవిత్వ చైతన్యానికి ఒక దర్పణం కూడా. లక్సెట్టిపేట కేంద్రంగా పనిచేస్తున్న అక్షయ సాహితీ సృజన కళావేదిక వేదికగా, ఈ నేల నుంచి పుట్టిన కవులు రైతు జీవితాన్ని, తెలంగాణ మాండలికాన్ని, మట్టి వాసనను తమ కవిత్వంలో ఎంత సహజంగా, బలంగా పలికిస్తున్నారో ఈ సంకలనం చూపిస్తుంది. 

అల్లాడి శ్రీనివాస్ మట్టి గోడల కవిత, డాక్టర్ శ్రీనాథ్ గౌడ్ యాస కవిత్వం లాంటివి కేవలం భాషా ప్రయోగాలు కావు.. అవి మంచిర్యాల నేల గొంతు. ఒక పక్క ఛందోబద్ధ పద్యాలు రాసే సంప్రదాయవాదులు, మరో పక్క సామాజిక సమస్యలపై సూటిగా గళమెత్తే ఆధునిక కవులు, ఒక వైపు లబ్ధ ప్రతిష్టులైన సీనియర్ కవులు, మరోవైపు ఇప్పుడిప్పుడే కవిత్వపు మొగ్గలు తొడుగుతున్న యువ కవులు/కవయిత్రులు అందరూ ఒకే వేదికపై కలవడం, ఈ జిల్లా కవిత్వం సంప్రదాయాన్ని, ఆధునికతను ఏకకాలంలో మోసుకెళ్తున్న సూచనగా చెప్పుకోవచ్చు. 

ఒక చిన్న లోటు

అయితే సంకలనంలో అక్కడక్కడ కొన్ని అక్షర దోషాలు పంటి కింద రాయిలా తగులుతాయి. వచ్చే ముద్రణలో వీటిని సరిచేసుకుంటే, ఈ సంకలనం మరింత సంపూర్ణంగా నిలుస్తుంది. 
ఒక్కో పువ్వుది ఒక్కో రంగు… ఒక్కో కవిది ఒక్కో తీరు! బతుకమ్మ పండుగలో భిన్నమైన పూలు చేరి ఒక సుందర రూపమైనట్టు, 82 మంది కవుల అంతరంగ అక్షరాలు ఒకటై రూపుదిద్దుకున్న అక్షర వేడుక ఈ ‘తీరు తీరు పూలు’. ఈ అక్షర వనం రూపుదిద్దుకోవడానికి తీరొక్క పూలను ఏరుకొచ్చిన అక్షయ సాహితీ సభ్యులకు, ఆ పూలనన్నింటినీ కనువిందు చేసే బతుకమ్మగా పేర్చిన సంపాదకులు శ్రీ వేనంక చక్రవర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 

–  వినయ్ కుమార్ కొట్టే-

 

 

©️ VIL Media Pvt Ltd.