
కర్ణాటకలోని హసన్ తాలూకా, శాంతిగ్రామంలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూల్ దుస్థితి ఇది. పాటశాలకు చెందిన 170 మందికి పైగా స్టూడెంట్స్ ఐదేళ్లుగా ఒక పశువుల పాకలోనే నివసిస్తూ, తింటూ, తరగతులకు హాజరవుతున్నారు. కర్ణాటక సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పాఠశాలలో 6 నుండి 10వ తరగతి వరకు 92 మంది బాలురు, 80 మంది బాలికలు చదువుతున్నారు. ప్రత్యేక వసతి లేదా తరగతి గదుల సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో, విద్యార్థులు పశువుల పాకలోనే ఉంటూ అక్కడే చదువుకుంటున్నారు.
ఈ విషయం విద్యాశాఖ మంత్రి దృష్టికి వెళ్లడంతో ఈ ఘటనపై నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు. గత ఐదేళ్లుగా విద్యార్థులు ఆ షెడ్డును తరగతి గదిగా, భోజనశాలగా, నిద్రించే స్థలంగా వాడుతున్నారని సమాచారం. అంతేకాకుండా, 6వ తరగతి విద్యార్థులను పాఠాల సమయంలో నేలపై కూర్చోబెడుతున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి.
పశువుల పాకలో గాలి, వెలుతురు సరిగా లేవని అంటున్నారు. దీనివల్ల విద్యార్థులు చదువుకోవడానికి, నివసించడానికి ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. పారిశుధ్య సౌకర్యాలు కూడా సరిపోవడం లేదని సమాచారం. 92 మంది అబ్బాయిలకు కేవలం ఐదు మరుగుదొడ్లు మాత్రమే ఉండగా, 80 మంది అమ్మాయిలకు కనీస సౌకర్యాలు కూడా లేవని చెబుతున్నారు.
►ALSO READ | మేనరికపు పెళ్లిళ్లపై వాస్తవాలు వెలుగులోకి.. అలా పెళ్లిళ్లు చేసుకోవచ్చా..? లేదా..?
ఆరోపణలపై స్పందించిన విద్యాశాఖ అధికారులు కొత్త పాఠశాల భవన నిర్మాణం ప్రస్తుతం జరుగుతోందని.. విద్యార్థులకు సరిపోయే ప్రత్యామ్నాయ భవనాన్ని ఏర్పాటు చేయలేకపోవడంతో వారిని పశువుల కొట్టానికి తరలించినట్లు తెలిపారు.
విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులు, వారికి సరైన నివాస పాఠశాల సౌకర్యం కల్పించడంలో జరుగుతున్న జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యాశాఖ మంత్రి.