
TVK Leader Mu*rd*er: చెన్నైలో అధికార టీవీకే పార్టీకి చెందిన నేత హత్య కలకలం సృష్టిస్తోంది.. వాంతురైలో టీవీకే నేత కన్నన్ దారుణ హత్యకు గురయ్యారు. 45 ఏళ్ల కన్నన్‌ను దుండగులు వెంటాడి కొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలతో మృతి చెందారు. గతంలో అన్నాడీఎంకే 174వ వార్డు కార్యదర్శిగా పనిచేసిన కన్నన్.. ఇటీవలే టీవీకేలో చేరారు. అయితే, కన్నన్ టీవీకేలో చేరడమే హత్యకు కారణమని ఇప్పటివరకు పోలీసులు నిర్ధారించలేదు. కన్నన్‌పై గతంలో హత్య, హత్యాయత్నం సహా పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ముఖ్యంగా 2009లో జరిగిన శివ హత్య కేసుకు సంబంధించిన పాత కక్షలే తాజా హత్యకు కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కన్నన్ నిర్వహిస్తున్న కార్ల అద్దె వ్యాపారానికి సంబంధించిన వివాదాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. కన్నన్‌ను దుండగులు వెంటాడిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాత కక్షలు, క్రిమినల్ నేపథ్యమే ప్రధాన కారణంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, టీవీకే అధినేత, ముఖ్యమంత్రి విజయ్ శాంతిభద్రతల అంశంపై అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్న సమయంలోనే ఈ హత్య జరగడంతో తమిళనాడులో రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.