Reading Time: 2 minutes

సాత్విక్‌‌- చిరాగ్‌‌ జోడీ సూపర్ విక్టరీ .. చైనా మాస్టర్స్ సూపర్ 750 టైటిల్ కైవసం

Caption of Image.
  • తొలి గేమ్ కోల్పోయినా.. అద్భుత కంబ్యాక్‌‌
  • చైనా జోడీని చిత్తు చేసిన భారత షట్లర్లు

షెన్‌‌జెన్: చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నమెంట్‌‌లో భారత స్టార్ షట్లర్లు సాత్విక్‌‌ సాయిరాజ్ రాంరెడ్డి, చిరాగ్ శెట్టి అద్భుత విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఫైనల్‌‌లో చైనాకు చెందిన హిజిటింగ్, రెన్ జియాంగ్ యు జోడీపై అరుదైన పోరాటంతో విజయం సాధించి చైనా మాస్టర్స్ టైటిల్‌‌ను కైవసం చేసుకున్నారు. 

2026 సీజన్​లో వీరికిది రెండో టైటిల్ కావడం విశేషం. మ్యాచ్‌‌‌‌ ప్రారంభం నుంచే చైనా జోడీ హిజిటింగ్, రెన్ జియాంగ్ యు దూకుడు ప్రదర్శించారు. భారత జోడీ షాట్ సెలెక్షన్ సరిగ్గా లేకపోవడం, ప్రత్యర్థి వేగాన్ని అంచనా వేయలేకపోవడంతో తొలి గేమ్‌‌‌‌లో వెనుకబడ్డారు. వరుస తప్పులతో తొలి గేమ్‌‌ను 11-– 21 తేడాతో చైనా జోడీకి కోల్పోయారు. అనంతరం రెండో గేమ్‌‌‌‌లో సాత్విక్-చిరాగ్ జోడీ పూర్తిగా వ్యూహం మార్చింది. 

కోచ్ సూచన మేరకు దూకుడు ఆటను ప్రదర్శించారు. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పక్కా ప్లాన్‌‌తో చెలరేగి ఆడారు. ఈ గేమ్‌‌‌‌లో పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించిన సాత్విక్ -చిరాగ్ 21–-13 తేడాతో గెలిచి మ్యాచ్‌‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌‌కు తీసుకెళ్లారు.

నరాలు తెగే పోరు

ఆఖరిదైన మూడో గేమ్‌‌‌‌లో ఇరు జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఆట సాగింది. ఆరంభం నుంచి చైనా జోడీ ఒత్తిడి తెచ్చినా, సాత్విక్-చిరాగ్ ఎలాంటి టెన్షన్‌‌కు గురికాకుండా సంయమనం పాటించారు. ఒక దశలో వెనుకబడినప్పటికీ, స్కోరును 16-–16 వద్ద సమం చేశారు. ఈ కీలక తరుణంలో సాత్విక్ తన సర్వీస్‌‌తో అదరగొట్టగా, చిరాగ్ పర్ఫెక్ట్ స్మాష్‌‌లతో చెలరేగాడు. ఒత్తిడిని జయించి వరుస పాయింట్లు సాధించిన మన జోడీ మూడో గేమ్‌‌ను 21–-17తో  కైవసం చేసుకుని టైటిల్‌‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. 

ఆసియా క్రీడల కోసం ఫుల్ జోష్

ఈ నెల 19 నుంచి జపాన్ వేదికగా ప్రారంభం కానున్న ఆసియా క్రీడలకు ముందు ఈ టైటిల్ గెలవడం తమకు బిగ్ బూస్ట్ ఇచ్చిందని చిరాగ్ శెట్టి వెల్లడించాడు. “ఇంటికి వెళ్లిన తర్వాత రాబోయే 10 రోజులు తీవ్రంగా శ్రమిస్తాం. ఆసియా క్రీడల్లో మరింత దూకుడుగా బరిలోకి దిగుతాం” అని ధీమా వ్యక్తం చేశాడు. తొలి గేమ్‌‌లో షాట్ సెలెక్షన్ సరిగ్గా లేకపోవడం వల్లే ఓడిపోయామని, రెండో గేమ్ నుంచి మైండ్‌‌ఫుల్ అగ్రెసివ్‌‌నెస్‌‌తో ఆడి విజయం సాధించామని చెప్పాడు.

సర్వీస్‌‌పై ప్రత్యేక కసరత్తు

భుజం గాయం కారణంగా విశ్రాంతి తీసుకున్న సమయంలో సర్వీస్, రిసీవింగ్‌‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టానని సాత్విక్ తెలిపాడు. ప్రత్యర్థులు తను సర్వీస్ చేసేటప్పుడు టార్గెట్ చేస్తారనే ఉద్దేశంతోనే వీడియోలు చూసి మరీ ప్రాక్టీస్ చేశానని, ఆ కష్టమే ఇప్పుడు కోర్టులో కలిసి వచ్చిందని పేర్కొన్నారు. మూడో గేమ్‌‌లో ఎలాంటి టెన్షన్‌‌కు గురికాకుండా ప్రశాంతంగా ఆడి విజయాన్ని అందుకున్నట్లు చెప్పాడు.

©️ VIL Media Pvt Ltd.