Reading Time: 2 minutes
Cm Chandrababus Leadership Conclave Message To Tdp Mlas

TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు టార్గెట్‌ పెట్టారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించకపోతే ఎమ్మెల్యేలు పనిచేసినట్టే కాదని స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌లో ఆయన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. తొలిసారిగా లీడర్‌షిప్ కాన్‌క్లేవ్ నిర్వహిస్తున్నామని, నాయకత్వం అంటేనే తెలుగుదేశం అని చంద్రబాబు అన్నారు. ఎన్నో సమస్యలను పరిష్కరించానని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని సీఎం తెలిపారు. అయితే నీటి సమస్యలకు పరిష్కారం చూపినప్పుడే తనకు అత్యంత సంతృప్తి కలుగుతుందని చెప్పారు. సమర్థ నాయకత్వంతోనే సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు ప్రజలకు న్యాయం చేయగలమన్నారు. నాయకులు వర్తమానాన్ని అర్థం చేసుకుని, భవిష్యత్తును అంచనా వేయాలని సూచించారు. చెడు గురించి చెబితేనే మంచి అంటే ఏమిటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని వెంటిలేటర్‌పై పెట్టిందని, వ్యవస్థలను విధ్వంసం చేసిందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్‌తో కలిసి కూటమిని ఏర్పాటు చేశామని చెప్పారు. గతంలో ఎన్నడూ దక్కని విజయాన్ని ప్రజలు కూటమికి కట్టబెట్టారని తెలిపారు. పాలకుడు ఏ విధంగా ఉండకూడదో చెప్పడానికి గత పాలకుడే ఒక కేస్ స్టడీ అని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు అనునిత్యం పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనను సమతుల్యం చేస్తూ పాలన సాగిస్తున్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్-2047ను రూపొందించామని, జిల్లాలు, నియోజకవర్గాలకు కూడా విజన్ ప్లాన్‌లు ఇచ్చామని వివరించారు.

తాను నెలకు నాలుగు రోజులకు తక్కువ కాకుండా క్షేత్రస్థాయిలో ఉంటున్నానని చంద్రబాబు తెలిపారు. పేదల సేవలో, ‘మీ భూమి-మీ హక్కు’, స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర, సంజీవని కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకమవుతున్నానన్నారు. విద్య, వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలకు గుడ్‌బై చెప్పి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు వస్తున్నారని పేర్కొన్నారు. 63 లక్షల మందికి రూ.73 వేల కోట్ల మేర ఇప్పటికే పింఛన్లు పంపిణీ చేశామని సీఎం తెలిపారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్లు, ఆటో డ్రైవర్ల సేవలో, నేతన్నల సేవలో, దీపం, మత్స్యకారుల సేవలో వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని, ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించని వ్యక్తి తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులను నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 28 కొత్త పాలసీల ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, పరిశ్రమలను గ్రౌండింగ్ చేస్తున్నామని చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు ఇచ్చామని తెలిపారు. ఉత్తరాంధ్ర ఇక వెనుకబడిన ప్రాంతం కాదని, అభివృద్ధికి కేంద్రంగా మారుతోందన్నారు. గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వంటి భారీ ప్రాజెక్టులు ఉత్తరాంధ్రకు వస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. అమరావతిని క్వాంటం నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పోర్టులు నిర్మించడంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.

‘రాయలసీమ రైజింగ్’ నినాదంతో గోల్డ్ ఫీల్డ్, ఆమ్కా డిఫెన్స్ ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్ వంటి ప్రాజెక్టులను తీసుకొచ్చామని చంద్రబాబు వివరించారు. రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ద్వారా కొత్త ఆవిష్కరణలను, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. పరిపాలనలో టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చామని సీఎం చెప్పారు. వాట్సాప్ ద్వారా 1,100 ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌లో అందిస్తున్నామని తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని పేర్కొన్నారు. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని, క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా భూములకు భద్రత కల్పిస్తున్నామని వివరించారు.

ఇక, వందేళ్లకు పైగా కొనసాగుతున్న భూ వివాదాలను పరిష్కరిస్తున్నామని, 22ఏ భూముల సమస్యలకు మోక్షం చూపుతున్నామని చంద్రబాబు తెలిపారు. దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలను పరిష్కరిస్తే ప్రజా ప్రతినిధులను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని ఎమ్మెల్యేలకు సూచించారు. స్థానిక ఎన్నికల్లో విజయాన్ని సాధించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించాలని దిశానిర్దేశం చేశారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..