Reading Time: 2 minutes
Telangana Auto Drivers Meet Welfare Board Meter Charges On Agenda

Telangana Auto Workers Meet: ఆటో కార్మికుల సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుంది. నేడు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఆటో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు అంశం కీలకంగా మారనుంది. ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు సంస్థాగత పరిష్కారం చూపడంతో పాటు వారికి మరిన్ని సంక్షేమ పథకాలు అందించే విధానంపై చర్చించే అవకాశం ఉంది.

అగ్రిగేటర్ పాలసీపై ఆటో యూనియన్లు చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించనుంది. యాప్ ఆధారిత క్యాబ్‌, ఆటో సేవల నేపథ్యంలో డ్రైవర్లకు ఎదురవుతున్న ఇబ్బందులు, ఆదాయ భద్రత వంటి అంశాలపై సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను అధికారుల ముందు ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఆటో కార్మికులు చాలాకాలంగా కోరుతున్న మీటర్ ఛార్జీల పెంపు అంశం కూడా సమావేశంలో చర్చకు రానుంది. ప్రస్తుత నిర్వహణ వ్యయాలు, ఇంధన ధరలు, డ్రైవర్ల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఛార్జీల సవరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

డీజిల్‌, పెట్రోల్‌ ఆటోలను రీట్రోఫిట్మెంట్‌ చేసుకునేందుకు రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం అందించే అంశంపైనా సమావేశంలో చర్చ జరగనుంది. ఈ సాయానికి ఇటీవలే కేబినెట్‌ ఆమోదం తెలిపిన నేపథ్యంలో.. దాన్ని ఎలా అమలు చేయాలి? అర్హులైన వారికి ఎలా ప్రయోజనం చేకూర్చాలి? అనే అంశాలపై అధికారులు, యూనియన్‌ ప్రతినిధులతో చర్చించే అవకాశం ఉంది. గత నెల 23న ఆటో యూనియన్ల జేఏసీ ప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి సంబంధించిన పలు డిమాండ్లను వివరించడంతో.. వాటిని సానుకూలంగా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం.

వివిధ శాఖల సమన్వయంతో ఆటో కార్మికుల సమస్యలకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిశీలిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. సమావేశానికి పూర్తి సమాచారంతో హాజరుకావాలని సంబంధిత శాఖల ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే ఆటో యూనియన్ల జేఏసీ ప్రతినిధులను తప్పనిసరిగా సమావేశానికి ఆహ్వానించాలని రవాణా శాఖ కమిషనర్‌కు సూచించారు. నేడు జరిగే ఈ సమావేశం ఆటో కార్మికులకు కీలకంగా మారనుంది. సంక్షేమ బోర్డు ఏర్పాటు, అగ్రిగేటర్ పాలసీ, మీటర్ ఛార్జీల పెంపు, రీట్రోఫిట్మెంట్‌ సాయంతో పాటు ఇతర సమస్యలపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై ఆటో డ్రైవర్లలో ఆసక్తి నెలకొంది.