
Fauji: రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన పోస్టర్లు, అప్డేట్స్ చాలా తక్కువే. అయితే వచ్చిన ప్రతిసారీ మాత్రం సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ప్రభాస్‌ను ఇప్పటివరకు చూడని విధంగా ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో చూపిస్తున్న దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను ఏ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారన్నది ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో చర్చ మొదలైంది. తాజాగా ‘ఫౌజీ’ అవుట్‌పుట్ విషయంలో ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ కూడా డార్లింగ్ అభిమానుల్లో జోష్ పెంచుతోంది. ఇప్పటికే భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల గురించి వస్తున్న వార్తలు సినిమాపై హైప్‌ను మరింత పెంచుతున్నాయి.
ప్రేమకథలను తనదైన స్టైల్‌లో తెరకెక్కించడంలో పేరున్న హను, ఈసారి మాత్రం పూర్తిగా కొత్త జానర్‌లో భారీ స్థాయిలో ప్రయోగం చేస్తున్నారు. ప్రేమ, ఎమోషన్‌తో పాటు యాక్షన్, పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్, దేశభక్తి థీమ్స్ కలిపి ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ చూస్తే అర్థమవుతోంది. 1940ల కాలం నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రభాస్ ఒక సోల్జర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ కి విశేష స్పందన వచ్చింది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన తాజా ఇండస్ట్రీ బజ్ చూస్తే అసలు హైలైట్ యాక్షన్ సీక్వెన్స్ అనే తెలుస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న కొన్ని యాక్షన్ బ్లాక్స్ కోసం హను రాఘవపూడి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని టాక్. ఇటీవల వచ్చిన నివేదికల ప్రకారం సినిమాలో ఒక భారీ అండర్‌వాటర్ ఫైట్‌ను దాదాపు 20 రోజుల పాటు షూట్ చేసినట్లు సమాచారం. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన భారీ వాటర్ ట్యాంక్‌లలో, హాలీవుడ్ స్థాయి సాంకేతికతతో ఈ ఫైట్‌ను డిజైన్ చేశారు. సినిమాలో ప్రభాస్ పోషిస్తున్న మిలిటరీ ఆఫీసర్ పాత్రకు సంబంధించిన అత్యంత కీలకమైన, ఉత్కంఠభరితమైన సన్నివేశాలలో ఇదొకటిగా నిలవబోతోంది. వీటి అవుట్ పుట్ కూడా సాలీడ్ గా వచ్చిందని టాక్ వినిపిస్తోంది.
అంతేకాదు మరో భారీ యాక్షన్ బ్లాక్ కూడా సినిమాకు హైలెట్ గా ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది. నరసింహ స్వామి నేపథ్యంతో సాగే డివోషనల్ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా భారీగా డిజైన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఫైట్‌లో యాక్షన్‌తో పాటు ఎమోషన్, ఇంటెన్సిటీకి కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. ఒకే సినిమాలో ఇలాంటి విభిన్నమైన యాక్షన్ బ్లాక్స్‌ను హను ఎలా కలిపారన్నది థియేటర్లలో చూస్తేనే అసలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు ప్రభాస్ సినిమాల్లో మ్యూజిక్‌కు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. ‘ఫౌజీ’కి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. హను రాఘవపూడితో ఆయనకు ఇప్పటికే ‘సీతారామం’ సమయంలో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు అదే కాంబినేషన్ ప్రభాస్ సినిమాకు పనిచేయడం కూడా సినిమాపై బజ్ పెంచుతోంది. యాక్షన్, పీరియాడిక్ ఎమోషన్‌తో పాటు మంచి మ్యూజికల్ ఆల్బమ్‌ను కూడా అందించాలని టీమ్ చూస్తున్నట్లు సమాచారం.
ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, చైత్ర జే ఆచార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా ప్రేక్షకులను టార్గెట్ చేస్తోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సినిమా విడుదల కానుంది. ఇక రిలీజ్ విషయంలో మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. ‘ఫౌజీ’ ప్రపంచవ్యాప్తంగా 2026 డిసెంబర్ 3న థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ ఆఫీషియల్ గా ప్రకటించారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ నెలలోనే ఒక భారీ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.