
పండుగొచ్చిందంటే కొత్త బట్టలు.. కొత్త లుక్.. కొత్త స్టైల్. ఈసారి ఆ లుక్‌లో తెలంగాణ చేనేతకు ట్రెండీ టచ్ జోడవుతోంది. మగ్గాలపై రూపుదిద్దుకున్న పోచంపల్లి ఇకత్, గద్వాల్, నారాయణపేట, సిద్దిపేట వస్త్రాలు ఇప్పుడు డిజైనర్ కలెక్షన్లలో మెరిసిపోతున్నాయి. సంప్రదాయ నేత కళకు ఆధునిక డిజైన్లు తోడవడంతో పండుగ వార్డ్‌రోబ్‌లో చేనేతకు ప్రత్యేక స్థానం లభిస్తోంది.
హైదరాబాద్ నగరవాసుల కోసం సెప్టెంబరు నెలలో పండుగల సందర్భంగా సరికొత్త డిజైనర్ వస్త్రాలు అందుబాటులోకి రానున్నాయి. బంజారాహిల్స్‌లోని సీసీటీ స్పేస్‌లో ‘పిలిటాక్సీ ఇండియా’ ఆధ్వర్యంలో ప్రత్యేక ఫ్యాషన్ ప్రదర్శన, విక్రయ కార్యక్రమం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 11, 12 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమంలో 25 మంది డిజైనర్లు రూపొందించిన ప్రత్యేక వస్త్రాలు, సంప్రదాయ దుస్తులు, హస్తకళా ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నాయి.
పండుగ వార్డ్‌రోబ్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దుకునే వారికి ఈ ప్రదర్శనలో విభిన్నమైన ఎంపికలు లభించనున్నాయి. అల్కా నాథ్ రూపొందించిన హస్తకళ, సంప్రదాయ పద్ధతులను ఆధునిక రూపాల్లో పునఃసృష్టించిన పండుగ కుర్తా సెట్లు, డిజైనర్ ఆభరణాలు, పండుగ దుస్తులకు అనువైన టూపాన్లు, అందమైన హ్యాండ్-బ్లాక్ ప్రింట్ వస్త్రాలు ఆకట్టుకోనున్నాయి.సంప్రదాయానికి ఆధునికతను జోడించిన డిజైన్లకు ఈసారి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు నిర్వాహకులు చెప్తున్నారు.
సిరిపట్టు పీతాంబరం చీర
కాకతీయుల శౌర్యానికి ప్రతీకగా నిలిచే కమాన్‌తోపాటు వేములవాడ రాజన్న కోడె మొక్కులను సూచించే జరీ బుటాలను అద్భుతంగా పొందుపరుస్తూ సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారిణి వెల్ది రేఖ నేసిన ‘సిరిపట్టు పీతాంబరం’ చీర మహిళలను విశేషంగా ఆకట్టుకుంటోంది. 48 అంగుళాల వెడల్పు, ఐదు మీటర్ల పొడవుతో 605 గ్రాముల బరువున్న ఈ ప్రత్యేకమైన పట్టుచీరను చేనేత మగ్గంపై 45 రోజుల పాటు శ్రమించి రేఖ రూపొందించారు.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకలైన అంశాలను చీరలో జరీ బుటాల రూపంలో పొందుపరచడం ఈ చీర ప్రత్యేకతగా నిలుస్తోంది. అరుదైన డిజైన్‌తో రూపొందించిన ఈ చీరకు విశేష గుర్తింపు లభించడంతో పాటు, దీనిని నేసిన వెల్ది రేఖకు ప్రతిష్టాత్మకమైన కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు లభించింది. సంప్రదాయ చేనేత నైపుణ్యానికి సృజనాత్మకతను జోడించి రూపొందించిన ఈ చీర సిరిసిల్ల చేనేత కళాకారుల ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది.
సహజసిద్ధ రంగులతో చేనేత వస్త్రాలు
ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా చెట్లు, పూలు, పండ్ల తొక్కల నుంచి తయారు చేసిన సహజసిద్ధ రంగులతో చేనేత వస్త్రాలను నేస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు ముఖేష్ కర్నాటి. పర్యావరణహిత రంగులతో తయారు చేస్తున్న చీరలు, దుపట్టాలు, డ్రెస్ మెటీరియల్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు.
ఇండిగో మొక్క నుంచి నీలి రంగు, మంజిష్టా చెట్టు నుంచి ఎరుపు రంగును తయారుచేస్తున్నారు. అలాగే దానిమ్మ తొక్కలు, బంతిపూలు, మోదుగ పూలతో పసుపు రంగును, ఇనుము తుప్పు, తాటిబెల్లం వంటి సహజ పదార్థాలతో నల్ల రంగును తయారు చేసి నూలు దారాలకు అద్దుతున్నారు. అనంతరం ఈ రంగు దారాలతో చీరలు, దుపట్టాలు, డ్రెస్ మెటీరియల్ తదితర చేనేత వస్త్రాలను నేస్తున్నారు.సహజసిద్ధ రంగులతో తయారయ్యే వస్త్రాలు పర్యావరణానికి అనుకూలంగా ఉంటున్నాయని ఆయన తెలిపారు.
నేత వస్త్రాలకు ఆన్‌లైన్ మార్కెట్
ముఖ్యంగా పోచంపల్లి ఇకత్ నేత వస్త్రాలకు ఆన్‌లైన్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. పోచంపల్లి విక్రేతలు ప్రస్తుతం కాటన్ చీరలు, దుపట్టాల నుంచి డిజైనర్ ఇకత్ వస్త్రాలు, పట్టు ఉత్పత్తులు, సల్వార్ సెట్ల వరకు విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందిస్తున్నారు. సంప్రదాయ నేత పద్ధతుల్లో తయారైన వస్త్రాల ప్రత్యేకతను కాపాడుతూనే వాటిని చీరలు, దుపట్టాలు, డ్రెస్ మెటీరియల్‌తో పాటు ఆధునిక దుస్తులుగా రూపొందించడం ద్వారా చేనేతకు కొత్త రూపాన్ని తీసుకొస్తున్నారు.
దీంతో సంప్రదాయ తెలంగాణ చేనేతకు ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలోనూ ప్రత్యేక స్థానం లభిస్తోంది. పండుగ ఫ్యాషన్‌లో ట్రెండ్ మారుతున్నా.. తెలంగాణ చేనేతపై మమకారం మాత్రం తగ్గడం లేదు. సంప్రదాయ నేత కళకు ఆధునిక డిజైన్లు, డిజిటల్ మార్కెట్ తోడవడంతో మగ్గం మీద పుట్టిన వస్త్రాలు ఇప్పుడు నగరాల వార్డ్‌రోబ్‌లను అలంకరిస్తున్నాయి. పండుగ వేళ స్టైల్‌తో పాటు మన చేనేతకు చేయూతనివ్వాలనుకునే వారికి పోచంపల్లి ఇకత్ సహా తెలంగాణ చేనేత వస్త్రాలు చక్కటి ఎంపికగా నిలుస్తున్నాయి.
చేనేతకు పెరుగుతున్న ఆదరణ
తెలంగాణ చేనేత వస్త్రాలు కూడా కొనుగోలుదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పోచంపల్లి ఇకత్, గద్వాల్, నారాయణపేట, సిద్దిపేట చేనేత వస్త్రాలకు మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇవి చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు వినియోగదారులకు ప్రత్యేకమైన, ఆధునిక లుక్‌ను అందిస్తున్నాయి.
సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లైవ్, ఆన్‌లైన్ స్టోర్లు, డిజైనర్లు, ఫ్యాషన్ కలెక్షన్ల ద్వారా తెలంగాణ చేనేత వస్త్రాలు గ్రామీణ మగ్గాల నుంచి ఉన్నత శ్రేణి పట్టణ వార్డ్‌రోబ్ వరకు కొత్త మార్కెట్‌ను సృష్టించుకుంటున్నాయి.